Eknath Shinde Ayodhya Visit:
అయోధ్యలో శిందే..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అయోధ్యలో పర్యటించారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన ఆయన...రామ మందిర నిర్మాణ పనులనూ పరిశీలించారు. పనులు వేగంగా జరుగుతుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఆయన...ప్రతిపక్షాలను విమర్శించారు. ఇన్నేళ్లలో రామ మందిర నిర్మాణాన్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, ఎవరికీ సాధ్యం కానిది ప్రధాని మోదీకి సాధ్యమైందని ప్రశంసించారు.
"రామ మందిర నిర్మాణానికి ఇప్పటి వరకూ ఎవరూ ఏమీ చేయలేదు. కేవలం ప్రధాని మోదీకి మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ ఆలయ నిర్మాణం లక్షలాది మంది రామ భక్తుల కల. ఈ కలను ప్రధాని మోదీ సాకారం చేశారు. రామ మందిరాన్ని కట్టాలని బాలాసాహెబ్ థాక్రే కలలు కనేవారు. మోదీ ఆయన కలను కూడా నిజం చేశారు. "
- ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ పర్యటనలో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా పాల్గొన్నారు. ప్రతిపక్షాలకు గురి పెట్టిన శిందే...కొన్ని పార్టీలు ఈ ఆలయ నిర్మాణంతో అసహనానికి లోనవుతున్నారని మండి పడ్డారు.
"కొన్ని పార్టీలు రామ మందిర నిర్మాణాన్ని తట్టుకోలేకపోతున్నాయి. మేం అయోధ్యలో పర్యటించడంపైనా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్లకు హిందుత్వ అలెర్జీ ఉంది. అయోధ్యకు రావడం మాకెంతో ఆనందంగా ఉంది. కొంత మంది కావాలనే హిందుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రజల విశ్వాసంతో ముడిపడిన అంశం. ముఖ్యమంత్రినయ్యాక మొదటి సారి అయోధ్యకు వచ్చాను. రాముడి ఆశీర్వాదంతోనే మాకు విల్లు, బాణం పార్టీ గుర్తు లభించింది. పార్టీ పేరు కూడా మాకే బదిలీ అయింది. "
- ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఇదే సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనితీరునీ ప్రశంసించారు శిందే. పాత యూపీకి, కొత్త యూపీకి ఎంతో తేడా ఉందని అన్నారు.
"పాత ఉత్తర ప్రదేశ్‌కి, కొత్త ఉత్తర ప్రదేశ్‌కి చాలా తేడా ఉంది. రాష్ట్రంలోని ప్రతి సాధారణ పౌరుడూ ఆనందంగా ఉన్నాడు. రోడ్లను అభివృద్ధి చేశారు. ప్రతి చోట్ల లైట్‌లు వెలుగుతున్నాయి. ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. యోగిని అంతా బుల్‌డోజర్ బాబా అని పిలుస్తున్నారు. గూండాలు ఆయన పేరు వింటేనే భయపడుతున్నారు"
- ఏక్‌నాథ్ శిందే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
Also Read: Shashi Tharoor: ఆయన వ్యాఖ్యల్లో లాజిక్ ఉంది కానీ - పవార్ కామెంట్స్‌పై స్పందించిన శశి థరూర్