Project Tiger 50 Years:


 

3,167 పులులు..

 

కర్ణాటకలోని బందింపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ కాయిన్‌ను విడుదల చేశారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రస్తుత పులుల సంఖ్యనూ వెల్లడించారు. మైసూరులోని జరిగిన ఓ కార్యక్రమంలో ఈ లెక్కలు ప్రకటించారు. ఈ లెక్కల ప్రకారం...దేశంలో పులుల సంఖ్య 3 వేలు దాటింది. భారత్‌లో  3167 పులులున్నట్టు మోదీ వెల్లడించారు. 1973లోని ఏప్రిల్ 1వ తేదీన భారత్‌లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పులుల సంరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70% మేర భారత్‌లోనే ఉన్నాయి. ఏటా 6% మేర సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు 9 టైగర్ రిజర్వ్‌లు ఏర్పాటు చేశారు. 50 ఏళ్లలో ఈ సంఖ్య 53కి పెరిగింది. ఈ మొత్తం రిజర్వ్‌ల విస్తీర్ణం 75 వేల చదరపు కిలోమీటర్లు. ఇంత మొత్త విస్తీర్ణంలో పులుల సంఖ్యను లెక్కించడం అంత సులభం కాదు. ప్రాజెక్ట్ టైగర్ మొదలు పెట్టిన మొదట్లో పులుల సంఖ్యను లెక్కించేందుకు గ్లాస్, బట్టర్ పేపర్‌ వినియోగించే వాళ్లు. వాటితోనే పులుల కాలి ముద్రలు గుర్తించేవారు. మనుషులకు ఉన్నట్టే పులులకూ కాలి ముద్రలు యునిక్‌గా ఉంటాయి. వీటితోనే అధికారులు గుర్తిస్తారు. అప్పట్లో ఫారెస్ట్ రేంజర్‌లు పులుల కాలి ముద్రల్ని బట్టర్ పేపర్‌పై సేకరించే వాళ్లు. ఆ రికార్డ్‌తోనే పులి ఎక్కడ తిరుగుతోందన్నదీ తెలుసుకునే వాళ్లు. పులి నిలబడినప్పుడు ఓ విధంగా, పరిగెత్తినప్పుడు మరో విధంగా రికార్డ్ అవుతాయి కాలి ముద్రలు. 

 

పులుల లెక్కను వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ...కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద పులుల సంరక్షణకు భారత్ ఎంతో కృషి చేసిందని అన్నారు. ప్రపంచంలోనే భారత్ ఈ విషయంలో ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. 





 

"పెద్ద పులుల సంరక్షణలో ప్రాజెక్ట్ టైగర్ కీలక పాత్ర పోషించింది. భారతదేశ సంస్కృతినీ ఈ ప్రాజెక్ట్‌ ప్రతిబింబించింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవడం కేవలం భారత్‌ కాదు..ప్రపంచానికే గర్వకారణం. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 75% భారత్‌లోనే ఉన్నాయి. వన్యప్రాణులను కాపాడాలంటే...ఇకోసిస్టమ్‌ను సంరక్షించాలి. భారత్‌లో ఇది విజయవంతంగా జరుగుతోంది. దశాబ్దాల క్రితం చీతాలు అంతరించిపోయాయి. ఇప్పుడు సౌతాఫ్రికా, నమీబియా నుంచి చీతాలను భారత్‌కు తీసుకొచ్చాం. వీటితో పాటు మన దేశంలో 30 వేల ఏనుగులున్నాయి. ఆసియాలోనే ఇన్ని ఏనుగులున్న దేశం మనదే"

 

- ప్రధాని నరేంద్ర మోదీ