మూడు వారాల తరవాత స్వగృహానికి ఏక్‌నాథ్ షిందే..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి థానేలోని సొంతింటికి వెళ్లిన ఏక్‌నాథ్ షిందేకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఏక్‌నాథ్ షిందే సతీమణి లతా షిందే బ్యాండ్ బాజాతో భర్తకు స్వాగతం పలికారు. స్వయంగా డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు వారాల క్రితం ఇల్లు వీడిన ఏక్‌నాథ్ షిందే, అప్పుడే శివసేన ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. మరికొందరు ఎమ్మెల్యేలనూ తన వైపు తిప్పుకున్నారు. తరవాత మారిన రాజకీయ పరిణామాలతో సీఎం పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో ఇంటికి వచ్చారు. ఆనంద్‌నగర్‌లోని స్వగృహానికి వచ్చిన సమయంలో భారీగా అభిమానులు తరలి వచ్చి స్వాగతం పలికారు. కార్‌పై పూలు జల్లుతూ నినాదాలు చేశారు. భారీ వర్షాన్నీ లెక్క చేయకుండా ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూశారు.
బలాన్ని నిరూపించుకునేందుకేనా..?
ఆనంద్ ఆశ్రమ్, ఆనంద్ దిగే శక్తిశాలలో ఆనంద్ దిగేకి నివాళులర్పించారు. బాల్‌ఠాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలనే ఉద్దేశంతోనే శివసేన నుంచి బయటకు వచ్చానని ఈ సందర్భంగా చెప్పారు. తన బలాన్ని నిరూపించుకునేందుకే ఈ స్థాయిలో గ్రాండ్ వెల్‌కమ్ ఏర్పాటు చేశారని అంటున్నారు. మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో సీఎం సీటు దక్కించుకున్నారు ఏక్‌నాథ్ షిండే. అసలైన శివసేన ఇదేనని ప్రచారం చేసుకుంటున్నారు. భాజపా ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని అంతా ఊహించినా అనుకోకుండా చివర్లో ట్విస్ట్ ఇచ్చింది కాషాయ పార్టీ. ఏక్‌నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించింది.
ఫడణవీస్ డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోవా వెళ్లారు షిండే. తనకు మద్దతు తెలిపిన వారందరితోనూ సమావేశమయ్యారు. సీఎంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తొలిరోజే షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బాలాసాబెబ్ థాక్రే సిద్ధాంతాలు నమ్మే శివసైనిక్" ముఖ్యమంత్రి అవటం పట్ల మహారాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. తనకు మద్దతు తెలిపిన ఆ 50 మంది ఎమ్మెల్యేల వల్లే ఇదంతా సాధ్యమైందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రజలు ఏవైతే ఆశించారో, ఆ పనులన్నింటినీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే షిండే ప్రకటించారు. బాలాసాహెబ్ థాక్రే విజన్‌కు అనుగుణంగా, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు షిండే. అందరితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని దాట వేస్తున్నారు.