భాజపాకు కీలక మంత్రిత్వ శాఖలు..?
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైనట్టు సంకేతాలిస్తోంది ప్రభుత్వం. రెండు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ జరగక ముందు ఓ విడత విస్తరణ చేసి, ఎన్నికలు పూర్తయ్యాకమరో ఫేజ్ చేపట్టాలని యోచిస్తోంది. జూన్ 30 వ తేదీన సీఎంగా ఏక్‌నాథ్ శిందే, డిప్యుటీ సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లతో పాటు గవర్నర్ తప్ప మరెవరూ బాధ్యతలు చేపట్టలేదు. ట్రస్ట్ ఓట్ ప్రక్రియలో గెలుపొందాక, కేబినెట్ విస్తరణ చేస్తారని భావించారు. కానీ ఇందుకు కాస్త సమయం కావాలని సీఎం శిందే అన్నారట. నేతలందరి ప్రొఫైల్స్ మరోసారి చూశాక, తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారట. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం...28 మంది భాజపా నేతలకు మంత్రిత్వ శాఖలు అప్పగించేందుకు సీఎం శిందే అంగీకరించినట్టు తెలుస్తోంది.
విస్తరణ అప్పుడే అవుతుందా..?
ముఖ్యమంత్రి శిందే పరిధిలో 14 మంత్రిత్వశాఖలు ఉండే అవకాశముంది. హోమ్, ఫైనాన్స్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, హౌజింగ్, ఎనర్జీ, స్కిల్ డెవలెప్‌మెంట్ అండ్ ప్లానింగ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, క్రీడలు తదితర విభాగాలు భాజపాకు కేటాయించనున్నారు. పట్టణాభివృద్ధి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పర్యావరణం, వ్యవసాయం, విద్య, నీటి సరఫరా, టూరిజం, రవాణా, ఆరోగ్య మంత్రిత్వశాఖలు శిందే శిబిరంలోని వారికి ఇవ్వనున్నారు. నిజానికి ఈ పాటికే కేబినెట్ విస్తరణ జరగాల్సింది. కానీ, శిందే శిబిరంలోకి వెళ్లిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలన్న వాదనను సుప్రీం కోర్టు ఇంకా వినాల్సి ఉంది. అంతే కాదు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మరో పిటిషన్ కూడా వేశారు. శివసేన విప్‌ను కాదని శిందే సూచించిన కొత్త విప్‌ను నియమించటాన్ని సవాలు చేశారు. ఈ హియరింగ్ అయిపోయాకే, కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావించారు. అయితే ఈ జులై 11వ తేదీన హియరింగ్ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి శిందేపై ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. చాలా మంది ఆయనను "కేబినెట్ విస్తరణ" ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారట.
"నేను, దేవేంద్ర ఫడణవీస్ కలిసి కూర్చుని అందరి పోర్ట్‌ఫోలియోలు పరిశీలిస్తాం. జాతీయ స్థాయి భాజపా నేతల సలహాలూ తీసుకున్నాకే తుది నిర్ణయాలు ప్రకటిస్తాం" అని గతంలోనే చెప్పారు సీఎం శిందే. అటు డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా "త్వరలోనే మంత్రివర్గ విస్తరణ" జరుగుతుందని స్పష్టం చేశారు. మొత్తానికి మరో వారం పది రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
Also Read: Anasuya: 'జబర్దస్త్' వదిలేసిన అనసూయ - ఆ స్టార్ డైరెక్టరే కారణమా?