MP Urination Case: ఇటీవల మధ్య ప్రదేశ్ లోని సిదీలో ఆదివాసీ యువకుడిపై బీజేపీ నేత ఒకరు మూత్రం పోసిన ఘటన వెలుగులోకి రావడం.. అందుకు క్షమాపణలు చెబుతూ సీఎం ఆ వ్యక్తి కాళ్ల కడగడం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు కాళ్లు కడిగించున్న వ్యక్తి. అసలైన బాధితుడిని తాను కాదని చెబుతూ బాంబు పేల్చాడు. నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్ పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే తాను కలెక్టర్ కు అబద్ధం చెప్పానని వివరించారు. అంతేకాకుండా.. ఈ ఘటన 2020లో జరిగిందని, అప్పుడు తాను మద్యంలో ఉన్నట్లు పేర్కొన్నాడు. తనపై ఎవరు మూత్రం పోశారో కూడా తనకు తెలియదని... కాకపోతే వీడియో వైరల్ కావడంతో పోలీస్ స్టేషన్ కు, ఆ తర్వాత కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని వివరించాడు. ఈక్రమంలోనే తాను అబద్ధం చెప్పానని.. వీడియోలో చూపించిన వ్యక్తిని తాను కాదంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిందితుడు పర్వేశ్ శుక్లా స్వయంగా నేరం అంగీకరించడంతో తాను ఇదంతా నమ్మానని స్పష్టం చేశాడు. 






బాధితుడు దశమత్ చేసిన ఈ ప్రకటనతో పెద్ద ఎత్తున దుమారం లేస్తోంది. ముఖ్యంగా సీఎంపై ప్రతిపక్షాలు విపరీతమైన విమర్శలు చేస్తున్నాయి. నిజమైన బాధితుడి కాళ్లు కడగకుండా సీఎం డ్రామా ఆడారంటూ కాంగ్రెస్ విమర్శించింది. గిరిజన యువకుడిపై బీజేపీ నేత మూత్రం పోసిన వీడియో వైరల్ కావడంతో.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. బాధితుడికి ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలు, ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షలు అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే నిందితుడు పర్వేశ్ శుక్లాను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో కూల్చేశారు.


బాధితుడి కాళ్ల కడగడానికి ముందు సీఎం మాట్లాడుతూ... "ఆ వీడియో చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నన్ను క్షమించండి. ప్రజలే నాకు దేవుళ్లతో సమానం" అని బాధితుడితో చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్. కాళ్లు కడిగిన తరవాత ఆయనకు పూల మాల వేసి గౌరవించారు. ఆ తరవాత శాలువా కప్పారు. చాలా సేపు పక్కనే కూర్చుని మాట్లాడారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు చెప్పారు.