Lufthansa Flight Cancelled:



అంతర్జాతీయంగా లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్‌ లైన్స్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా చాలా విమానాలు రద్దైనట్టు ఆ కంపెనీ వెల్లడించింది. అయితే...సమస్యకు కారణమేంటన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. దీనిపై ఇంకా విచారణ చేపడుతున్నట్టు వివరించింది. ప్రస్తుతానికి ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ అని మాత్రమే చెబుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. జర్మనీలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా..బోర్డింగ్ చాలా ఆలస్యమవుతోందని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. లగేజ్‌ను ప్రాసెస్ చేసే విషయంలో డిజిటలైజేషన్ నిలిచిపోయిందని, పేపర్ పెన్ సాయంతో ఒక్కొక్కరి నుంచి సమాచారం తీసుకుని బోర్డింగ్ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఈ విషయమై ట్వీట్ చేసింది. 


"ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్‌ కారణంగా లుఫ్తాన్సా గ్రూప్‌ ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం పడింది. ఈ కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరి కొన్ని పూర్తిగా రద్దైపోయాయి. ప్రయాణికులకు కలిగిన ఈ అంతరాయానికి చింతిస్తున్నాం"


-లుఫ్తాన్సా గ్రూప్


ఇప్పటికే కొన్ని టేకాఫ్ అవగా వాటిని వెంటనే ల్యాండ్ చేసేసింది కంపెనీ. మరి కొన్నింటిని ల్యాండ్ అవ్వాల్సి ఉంది.