Love Is BLind : అది ఓ కోర్టు హాల్. ఓ వైపు మధ్యవయస్కులైన జంట ఉన్నారు. మరో వైపు యుక్త వయసులో ఉన్న జంట ఉన్నారు. ఆ మధ్య వయస్కులైన జంట యువక్త వయుస్కులైన జంటలో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు. వారు తమ బిడ్డ వైపు ఆర్తిగా చూస్తున్నారు. కానీ ఆ బిడ్డ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇంతలో విచారణ ప్రారంభమయింది. న్యాయమూర్తి .. కేసు వివరాలు చూసిన తర్వాత..వాదనలు విన్న తర్వాత ఆ అమ్మాయిని అడిగారు. మీరు ఎవరితో ఉండదల్చుకున్నారు అని.. అంటే తల్లిదండ్రులతోనా..లేకపోతే తాను కోర్టుకు వచ్చిన వ్యక్తితోనా అని. తాను తనతో పాటు ఉన్న వ్యక్తితోనే ఉంటానని చెప్పింది. అంటే తల్లిదండ్రులు వద్దని అర్థం. న్యాయమూర్తికి పరిస్థితి అర్థం అయిపోయింది. ఆ న్యాయమూర్తి కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే.. ఆమె వయసురీత్యా మేజర్. ఆమె తన జీవితంపై తాను నిర్ణయం తీసుకోగలదు. అందుకే.. భారమైన తీర్పు ఇచ్చారు.
ఈ కేసులో అమ్మాయి పేరు నిసర్గ. ఆమెను తల్లిదండ్రులు కష్టపడి పెంచారు. ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. కానీ నిఖిల్ అలియాస్ అభి అనే డ్రైవర్‌ను ప్రేమించింది. చదువు అయిపోక ముందే మూడో ఏడాదే ఇంట్లో నుంచి వెళ్లిపోయి నిఖిల్‌ను పెళ్లి చేసుకుంది. తమ కూతుకు కనిపించడం లేదని నిసర్గ తండ్రి నాగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణలో పోలీసులు నిసర్గను కోర్టులో ప్రవేశ పెట్టారు. తాను తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్‌తో ఇష్టపూర్వకంగా వెళ్లామని పెళ్లి చేసుకున్నామని.. కాపురం చేస్తున్నామని నిసర్గ తెలిపింది. తన తల్లితండ్రులతో వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పింది.
దీంతో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిజంగానే ప్రేమ గుడ్డిదని... అది తల్లితండ్రుల ప్రేమ కన్నా కూడా... సమాజం చూపించే ప్రేమ కన్నా కూడా గట్టిదని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు పిల్లుపై చూపించే ప్రేమ ... పిల్లలు తల్లిదండ్రులపై చూపించే ప్రేమ త్యాగాల గురించి మన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు నష్టం చేసేలా వ్యవహరించరని.. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు కష్టం చేయాలని అనుకోరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తర్వాత న్యాయపరంగా... నిసర్గ తన ఇష్టం వచ్చిన వ్యక్తితో వెళ్లే అవకాశం కల్పించింది.
దీంతో ఆ తల్లిదండ్రులు కోర్టు హాలు నుంచి విషణ్ణవదనంతో వెనుదిరిగారు. కళ్లలో పెట్టుకుని పెంచుకున్న బిడ్డ తమను కాదని ప్రేమించిన వాడ్ని కోరుకున్నదని వారి బాధ.