Security Breach Parlimanet:



ప్రధాని స్పందన..! 


లోక్‌సభలో దాడి (Parliament Security Breach) జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా అలజడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అటు ప్రతిపక్షాలు రెండు సభల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీతో (PM Modi) హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఈ ఘటనపై సభలోనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రధాని ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భద్రతా అధికారులతో మాత్రం భేటీ అయ్యారు. దాడి ఎలా జరిగిందో ఆరా తీశారు. ఎక్కడెక్కడ భద్రతా లోపాలున్నాయో వాటిని సరి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించినట్టు Dainik Jagran వెల్లడించింది. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపింది. ఈ దాడిని తక్కువ అంచనా వేయకూడదని భద్రతా పరంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని మోదీ తేల్చి చెప్పినట్టు వెల్లడించింది దైనిక్ జాగరణ్. ఈ ఆర్టికల్ ప్రకారం...ప్రధాని మోదీ ఏం అన్నారంటే..


"లోక్‌సభలో దాడి జరగడం చాలా దురదృష్టకరం. ఇది చాలా ఆందోళన కలిగించింది. పార్లమెంట్‌ భద్రతా వైఫల్యాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు. విచారణా సంస్థలు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాయి. అసలు ఈ దాడి వెనకాల ఉద్దేశాలేంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఎందుకిలా చేశారో తెలుసుకోవాలి. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఆలోచించాలి. వీటిని వివాదాస్పదం చేయడం కన్నా పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది"


- ప్రధాని నరేంద్ర మోదీ


డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకొచ్చారు. కలర్‌ టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఒక్కసారిగా ఎంపీలంతా ఉలిక్కిపడ్డారు. ఓ నిందితుడిని పట్టుకుని దాడి చేశారు. ఆ తరవాత పార్లమెంట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi on Security Breach) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ సమస్య తీవ్రమవుతోందని విమర్శించారు. ద్రవ్యోల్బణమూ పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 


"ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించే విధానాలే. ఇప్పుడు లోక్‌సభలో దాడి జరగడానికి కారణం కూడా నిరుద్యోగమే. భద్రతా వైఫల్యం తలెత్తింది. కానీ అది ఎందుకు జరిగిందో కూడా ఆలోచించుకోవాలి. దీనంతటికీ ప్రధాని మోదీయే కారణం. ద్రవ్యోల్బణమూ పెరుగుతోంది."


రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


Also Read: మెట్రో ట్రైన్‌ డోర్‌లో ఇరుక్కున్న చీర, తీవ్ర గాయాలతో మహిళ మృతి