Skin Brightening Tips : శీతాకాలంలో చర్మం తన సహజమైన రంగును కోల్పోయి.. కాస్త డార్క్​గా మారుతుంటుంది. అదే డ్రై స్కిన్​ ఉన్నవారికి ఇదో పెద్ద సమస్యనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమస్య వారిలో మరింత అధ్వానంగా ఉంటుంది. అయితే మీరు కొన్ని సహజమైన పద్ధతులతో మీ స్కిన్​ టోన్​ని నార్మల్​ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి మీ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. ఇంతకీ టాన్​ రిమూవ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన ఇంటి చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


బేబీ ఆయిల్స్ 


చర్మ సంరక్షణలో బేబీ ఆయిల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. కాబట్టి మీ చర్మాన్ని రక్షించుకోవడం కోసం మీరు బేబీ ఆయిల్స్​ను మీ స్కిన్​కేర్​లో చేర్చుకోవచ్చు. పిల్లలకోసం తయారు చేసే ఈ ఆయిల్స్​లో కెమికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి మీ చర్మానికి ఎలాంటి హాని చేయవు. పైగా మీకు మెరుగైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీ నచ్చిన బేబీ ఆయిల్ తీసుకుని దానిని మీ శరీరానికి అప్లై చేయండి. ఓ అరగంట అలాగే ఉంచండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. మీ చర్మాన్ని ఎక్స్​ఫోలియేటింగ్​ స్క్రబ్​తో రబ్ చేయండి. ఇది టాన్​ని తొలగిస్తుంది. 


ఆర్గానిక్ బాడీ స్క్రబ్


డెడ్ స్కిన్​ సెల్స్​ తొలగించడానికి ఎక్స్​ఫోలియేటింగ్ గొప్ప మార్గం. దీనికోసం మీరు ఇంట్లోని కొన్ని పదార్థాలు ఉపయోగించాల్సి వస్తుంది. ఓ గిన్నెలో చక్కెర, ఆలివ్ నూనె తీసుకోండి. కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. వాటిని బాగా కలపండి. దీనిని మీ చర్మంపై అప్లై చేయండి. ఆ ప్రాంతాన్ని స్క్రబ్​తో సున్నితంగా మసాజ్ చేయండి. అనంతరం గోరు వెచ్చని నీటిని చల్లి.. స్క్రబ్​ చేసి స్నానం చేయవచ్చు ఇది టాన్​ను సహజంగా తొలగిస్తుంది. కాఫీ పౌడర్​ని కూడా మీరు స్క్రబ్​గా ఉపయోగించవచ్చు. 


యాపిల్ సైడర్ వెనిగర్​


యాపిల్ సైడర్ వెనిగర్​ చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి మీ చర్మంపై యాపిల్​ సైడర్​ వెనిగర్​ను అప్లై చేయవచ్చు. అయితే దానిని మీరు నేరుగా కాకుండా కాటన్ ప్యాడ్​ ఉపయోగించి దానిని శరీరానికి అప్లై చేయాలి. తర్వాత ప్యాడ్​తో మెల్లిగా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాలు అలాగే ఉండి.. స్నానం చేయాలి. ఇది డెడ్​ స్కిన్ సెల్స్​ని ఈజీగా తొలగిస్తుంది. 


బేకింగ్ సోడాతో.. 


టాన్​ను తొలగించుకోవడం కోసం.. ఎప్పటి నుంచే బేకింగ్ సోడాను ఉపయోగిస్తున్నారు. నీటిలో బేకింగ్ సోడా వేసి పేస్ట్​లా చేసి దానిని శరీరాని అప్లై చేయవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉంటే నిమ్మరసంతో కలిపి అప్లై చేయవచ్చు. కొబ్బరి నూనె, బేకింగ్ సోడా కూడా మంచి స్క్రబ్​గా పనిచేస్తుంది. మీరు దేనితో బేకింగ్​ సోడాను కలిపి ఉపయోగించినా.. ప్రాసెస్​ మాత్రం ఒకటే ఉంటుంది. ఈ పేస్ట్​ను చర్మంపై అప్లై చేసి.. కొంచెం సేపు తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 


నిమ్మరసంతో..


నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్.. మీ చర్మాన్ని డి-టాన్ చేయడంలో బాగా పనిచేస్తుంది. ఇది చర్మపు రంగును కాంతివంతంగా కూడా మారుస్తుంది. టాన్​, పిగ్మెంటేషన్​తో ఇబ్బంది పడేవారు నిమ్మరసంను హ్యాపీగా తమ స్కిన్​ కేర్​లో ఉపయోగించుకోవచ్చు. తాజాగా కట్​ చేసిన నిమ్మకాయను తీసుకుని.. ప్రభావిత ప్రాంతంపై రుద్దండి. దానిని అలాగే వదిలేసి తర్వాత స్నానం చేయండి. ఇది స్కిన్​ని బాగా ఎక్స్​ఫోలియేట్ చేస్తుంది. శరీరంపై ఏమైనా గాయాలుంటే మాత్రం దీనిని ఉపయోగించకపోవడమే మంచిది. లేదంటే మీకు భరించలేని మంట కలుగుతుంది. 


ఈ సహజమైన ఇంటి చిట్కాలు టాన్​ను బాగా రిమూవ్ చేస్తాయి. ఇవే కాకుండా మీరు టూత్​పేస్ట్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్​తో కూడా మీ శరీరంపై ఉన్న టాన్​ను తొలగించుకోవచ్చు. స్టీమ్​ బాత్​ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. నలుగు పిండి లేదా శనగ పిండిని కూడా మీ స్కిన్​ కేర్​లో చేర్చుకోవచ్చు. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​ లేకుండా మీ చర్మానికి సహజమైన, మెరిసే రంగును అందిస్తాయి. 


Also Read : వింటర్​లో జుట్టును కాపాడుకునేందుకు ఈ హెయిర్ మాస్క్​లు ట్రై చేయండి