Winter Hair Care : చలికాలంలో చర్మం, జుట్టు పొడిబారుతూ ఉంటుంది. ముఖ్యంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏ ప్రొడెక్ట్స్ ఉపయోగించాలన్నా దానిలోని కెమికల్స్ జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయి. చలికాలంలో వీచే గాలులు తక్కువ తేమను కలిగి ఉంటాయి. ఆ సమయంలో జుట్టును ఆరబెట్టడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దానివల్ల చుండ్రు వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఇవి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు పొడిబారి.. చివర చిట్లిపోతూ ఉంటుంది. ఇది జుట్టును బాగా డ్యామేజ్ చేస్తుంది. అయితే ఇంట్లోనే ఉంటూ.. కొన్ని సహజమైన పదార్థాలతో హెయిర్‌మాస్క్‌లు ట్రై చేయవచ్చు. ఇవి మీ జుట్టుకు మంచి పోషణను అందించి.. జుట్టు పొడిబారడాన్ని, రాలడాన్ని తగ్గిస్తాయి. అవే ఎలాంటి మాస్కులో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డుతో హెయిర్ మాస్క్
జుట్టుకు గుడ్డు మంచిదనే విషయం చాలామందికి తెలుసు. అయితే గుడ్డు స్మెల్ వస్తుందని కొందరు ఉపయోగించరు. అయితే ఈ మాస్క్ చేసే ప్రయోజనాలు తెలిస్తే వాసనను అస్సలు పట్టించుకోరు. గుడ్డు పూర్తిగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. పొడిబారడాన్ని తగ్గించి.. మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. ఈ మాస్క్‌లో ఉపయోగించే పెరుగు సహజమైన కండీషనర్‌గా తేమను జోడిస్తుంది. మీ జుట్టును మృదువుగా మారుస్తుంది.
ఓ గిన్నెలో గుడ్డును తీసుకుని దానిలో అరకప్పు పెరుగు వేసి బాగా కలపండి. దీనిని ఓ అరగంట పక్కనపెట్టేయండి. అనంతరం జుట్టుకు అప్లై చేసి.. 30 నిముషాలు ఉంచండి. అనంతరం చల్లని నీటితో జుట్టును బాగా శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ మీ జుట్టుకు తేమను అందించడమే కాకుండా మీ జుట్టును స్ట్రాంగ్‌గా మారుస్తుంది.
అరటి పండుతో..
ఒక అరటిపండును మెత్తగా చేసి.. దానిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. దీనితో మీ జుట్టుకు మసాజ్ చేయండి. చివర్ల వరకు దీనిని అప్లై చేసి.. మీ జుట్టును షవర్ క్యాప్‌తో కవర్ చేయండి. ఓ అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. అరటిపండులోని విటమిన్లు, కొబ్బరినూనె జుట్టును హైడ్రేట్ చేస్తాయి. మీ జుట్టుకు అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ఈ మాస్క్ తేమ, పోషణను అందిస్తుంది.
పాలు, తేనె మాస్క్
అరకప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపండి. దీనిని జుట్టుకు అప్లై చేసి.. అరగంట అలాగే వదిలేయండి. ఈ మాస్క్ మీ జుట్టును ఎక్కువ కాలం హైడ్రేట్‌గా ఉంచుంతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. తేనెలోని మాయిశ్చరైజింగ్ సామర్థ్యాలు.. పాలలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు మీ జుట్టును లోతుగా హైడ్రేట్ చేస్తాయి. చిక్కులు లేకుండా మంచి సిల్కీ హెయిర్‌ను అందిస్తాయి.
అవకాడో హెయిర్ మాస్క్
అవకాడోలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మాస్క్‌లో మనం తేనె కూడా తీసుకుంటాము. ఈ రెండు కలిసి జుట్టుకు సహజ పోషణను అందించి.. పొడి జుట్టును లోతుగా కండీషన్ చేస్తాయి. అంతేకాకుండా దానిని లాక్ చేస్తుంది. దీనివల్ల మీ జుట్టు మృదువుగా, మెరుస్తూ అందంగా మారుతుంది. ఈ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఓ పండిన అవకాడోను తీసుకోండి. దానిని బాగా మెత్తగా చేసి.. దానిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపండి. దీనిని తలకు బాగా పట్టించండి. ముఖ్యంగా మాడుపై దీనిని అప్లై చేయండి. ఓ అరగంట అలానే ఉంచి.. జుట్టును మైల్డ్ షాంపూతో వాష్ చేయండి. ఇది మీ జుట్టుకు మంచి తేమను, షైనింగ్‌ను అందిస్తుంది.
కలబందతో హెయిర్ మాస్క్
కలబందలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ జుట్టును హెల్తీగా మారుస్తాయి. దీనిలో ఆలివ్ నూనె కలిపితే.. మీ జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలనుంచి బయటపడుతుంది. మృదువైన, సిల్కీ హెయిర్ మీ సొంతమవుతుంది. రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి హెయిర్‌కి అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మీ జుట్టులో మార్పుని మీరే చూస్తారు.
ఈ హెయిర్ మాస్కులను మీరు ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకోగలరు. పైగా ఎక్కువ ఖర్చు కూడా కాదు. అయితే వీటిని ప్రయత్నించే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ వేసుకోండి. అన్ని సహజమైనవే అయినా.. కొందరికి ఇబ్బంది కలుగుతుంది. హెయిర్ మాస్క్ ఎప్పుడు వేసుకున్నా.. జుట్టును బాగా వాష్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మాస్క్ తలలో ఉండిపోతుంది. ఈ టిప్స్ చలికాలంలో మీ జుట్టును సంరక్షించుకోవడంలో బాగా హెల్ప్ చేస్తాయి.
Also Read : పిల్లల ఆరోగ్యానికి హెల్తీ రెసిపీ.. చలికాలంలో ఉదయాన్నే ఇస్తే చాలా మంచిది