Security Breach Lok Sabha:



అందుకే దాడి చేశారు: రాహుల్ 


లోక్‌సభ దాడి ఘటనపై (Lok Sabha Security Breach) ప్రతిపక్షాలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ,హోం మంత్రి అమిత్ షా సభలో ఈ దాడి గురించి మాట్లాడాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్పందించినప్పటికీ ప్రధాని మోదీ మాట్లాడాలి పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi on Security Breach) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ సమస్య తీవ్రమవుతోందని విమర్శించారు. ద్రవ్యోల్బణమూ పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 


"ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించే విధానాలే. ఇప్పుడు లోక్‌సభలో దాడి జరగడానికి కారణం కూడా నిరుద్యోగమే. భద్రతా వైఫల్యం తలెత్తింది. కానీ అది ఎందుకు జరిగిందో కూడా ఆలోచించుకోవాలి. దీనంతటికీ ప్రధాని మోదీయే కారణం. ద్రవ్యోల్బణమూ పెరుగుతోంది."


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ




ఖర్గే ఫైర్..


కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హోం మంత్రి అమిత్‌ షా మీడియా ముందు మాట్లాడడమే తప్ప సభలో ప్రకటన చేయరా అని ప్రశ్నించారు. ఇలా అడిగితే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి తప్పించుకుంటున్నాయని మండి పడ్డారు.