Pawan Kalyan not Attending the Yuvagalam Closing Ceremony: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' ముగింపు కార్యక్రమానికి తాను హాజరు కాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ 'యువగళం' పాదయాత్ర ఈ నెల 20తో ముగియనుంది. ఆ రోజు విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభ జరగనుంది. ఈ సభకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టీడీపీ ప్రత్యేక ఆహ్వానం పంపింది. అయితే, ఆ రోజు తనకు ముందుగా నిర్ణయించుకున్న వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే కార్యక్రమానికి హాజరు కాలేనని తెలిపారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తానని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నిర్వహించే పెద్ద సభలకు పవన్ హాజరవుతారని తెలుస్తోంది.
భారీ ఏర్పాట్లు.. ప్రత్యేక రైళ్లు
మరోవైపు, లోకేశ్ యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. దాదాపు, 5 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో 7 ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సభకు తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరవుతారని అంతా భావించారు. అయితే, వేరే కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేనని పవన్ చెప్పారు. దీంతో చంద్రబాబు, బాలకృష్ణ ఇతర పార్టీ ప్రముఖులు ముగింపు సభకు హాజరు కానున్నారు.
కొనసాగుతోన్న పాదయాత్ర
అటు, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 224వ రోజు (శనివారం) ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా లోకేశ్, అరబుపాలెం బీసీ నాయకులు, అనకాపల్లి బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో సమావేశమయ్యారు. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో బీసీలపై 26 వేల అక్రమ కేసులు బనాయించారని, తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, చంద్రబాబు హయాంలో 34 శాతానికి పెంచారని గుర్తు చేశారు. 'రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగవుతోంది. టీడీపీ - జనసేన అధికారంలోకి రాగానే నల్లబెల్లంపై ఆంక్షలు తొలగిస్తాం. చెరకు రైతులను ఆదుకుంటాం. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెడతాం.' అని వివరించారు. అనంతరం మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లిన లోకేశ్ వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరిస్తోందని, వారికి ఇచ్చిన హామీలను సీఎం జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.