Security Breach in Lok Sabha: 


లలిత్ ఝా అరెస్ట్..


పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దాడికి ప్లాన్ చేసిన మాస్టర్‌మైండ్ లలిత్‌ఝానీ అరెస్ట్ (Lalit Jha Arrest) చేశారు. ఈ ఘటన జరిగిన రోజే రాజస్థాన్‌కి పారిపోయాడు. కోల్‌కత్తాలో టీచర్‌గా పని చేస్తున్న లలిత్ ఝా తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయాడు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి కర్తవ్య్‌పథ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. ఢిల్లీ పోలీసులు ఈ నిందితుడుని స్పెషల్ సెల్‌ పోలీసులకు అప్పగించారు. లలిత్‌ ఝాతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ప్రధాన నిందితుడైన లలిత్ ఝా కి షెల్టర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌కి చెందిన మహేశ్, రాజేశ్‌కి లలిత్‌ఝాతో సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ ఇప్పటికే విచారణ మొదలు పెట్టింది. Bhagat Singh Fan Club ని ఫాలో అవుతున్న ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరైన మహేశ్ కూడా పార్లమెంట్‌ దాడిలో పాల్గొనాల్సింది. కానీ...కుటుంబ సభ్యులు వద్దని వారించారు. పార్లమెంట్‌కి రాకుండా అడ్డుకున్నారు. అయితే..లలిత్‌ ఝా కి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఆ తరవాత డిసెంబర్ 14న రాత్రి పూట లలిత్ ఝా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ నిందితుల్లో మొత్తం 4గురిపైనా ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు. 


ఆధారాలు మాయం..? 


ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝా సాక్ష్యాధారాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు సమాచారం. నలుగురు నిందితుల మొబైల్ ఫోన్స్‌ని కాల్చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నిందితుల్లో ఇద్దరి ఫోన్‌లను తన వద్దే ఉంచుకున్నట్టు లలిత్ ఝా అంగీకరించాడట. పార్లమెంట్ బయట దాడి చేసిన విజువల్స్‌ని రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కోల్‌కత్తాకి చెందిన NGO వాట్సాప్ నంబర్‌కీ షేర్ చేశాడు. దాదాపు 48 గంటలుగా పరారీలో ఉన్న లలిత్ ఝా..ఇద్దరు స్నేహితులతో కలిసి నాగ్‌పూర్‌కి వెళ్లాడు.