New Criminal Bills Passed:
పాత క్రిమినల్ చట్టం స్థానంలో మూడు కొత్త క్రిమినల్ కోడ్ బిల్లులను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. లోక్‌సభలో భారతీయ న్యాయ సన్హిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత్ 2023, భారతీయ సాక్ష్య 2023 బిల్లులను హోం మంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టగా...ఈ మూడు బిల్స్ ఆమోదం పొందాయి. గత రెండు రోజుల్లోనే 143 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఈ బిల్స్‌ని సభలో ప్రవేశపెట్టడం..అవి ఆమోదం పొందడంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి.
ఇప్పటి వరకూ అమల్లో ఉన్న Indian Penal Code, Code of Criminal Procedure, Indian Evidence Act చట్టాల స్థానంలో ఈ కొత్త బిల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ బిల్స్ ప్రవేశపెట్టే సమయానికి సభలో కేవలం ఏడుగురు ప్రతిపక్ష ఎంపీలు మాత్రమే ఉన్నారు. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఈ మూడు బిల్స్‌నీ రాజ్యాంగ స్ఫూర్తితోనే రూపొందించినట్టు వెల్లడించారు అమిత్ షా. బ్రిటీష్ కాలం నాటి చట్టాలు ప్రజలకు న్యాయం చేయలేవని, అందుకే సవరణలు చేయాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు.
"ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయన సూచన మేరకు నేను ఈ కొత్త బిల్స్‌ని ప్రవేశపెట్టాను. ఇవి ప్రజలకు మేలు చేయడమే కాదు రాజ్యాంగ స్ఫూర్తినీ చాటుతాయి. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా అన్ని చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నాం. బ్రిటీష్ కాలం నాటి చట్టాల్ని ఇప్పుడు ప్రజలకు ప్రయోజనం కలిగేలా సవరణలు చేశాం. గతంలో ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్న ఈ బిల్స్‌లో చిన్న చిన్న మార్పులు చేశాం. స్టాండింగ్ కమిటీ వీటిని పూర్తిస్థాయిలో పరిశీలించింది"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ కొత్త బిల్స్‌లో ప్రొవిజన్స్ చేర్చినట్టు వివరించారు అమిత్ షా. కోర్టులలో కేసులు వాయిదాలు పడడంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఈ సమస్య ఉండదని అన్నారు.
"నిరుపేదలకు అతి పెద్ద సవాలు...న్యాయం జరగడం. కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. జ్యుడీషియల్ సిస్టమ్‌పై పోలీసులు బాధ్యత వహిస్తారు. జ్యుడీషియల్ సిస్టమ్‌తో పాటు పోలీసు వ్యవస్థపై ప్రభుత్వానిదే బాధ్యత. ఎలా అయినా సరే న్యాయం జరగడంలో ఆలస్యం అయితే అది ప్రభుత్వానిదే తప్పిదమవుతుంది. అందుకే కొత్త బిల్స్‌లో ఈ సమస్య తీర్చాం"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి