Lok Sabha Elections Phase 6 2024 Updates: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ రేపు (25వ తేదీన) జరగనుంది. ఈ విడతలో మొత్తంగా 8 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగిసిపోగా ఇప్పుడు ఆరో విడతకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 1న జరిగే చివరి విడతతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు తెర పడుతుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదల కానున్నాయి. బిహార్, యూపీ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాలు ఈ విడత పోలింగ్‌లో ఉన్నాయి. బిహార్‌లో 8,హరియాణాలో 10, జమ్ముకశ్మీర్‌లో 1,ఝార్ఖండ్‌లో 4,ఢిల్లీలో 7,ఒడిశాలో 6,యూపీలో 14, బెంగాల్‌లో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. అందుకే ఆరో విడతలో ఆ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక ఈ విడతలో పార్టీల నుంచి కీలక నియోజకవర్గాల్లో కీలక అభ్యర్థులు బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.
కీలక అభ్యర్థులు వీళ్లే..
ఢిల్లీలో ఒకేసారి 7 లోక్‌సభ నియోజకవర్గాలు (Delhi Lok Sabha Polls phase 6) ఎన్నికలు జరగనున్నాయి. లిక్కర్ స్కామ్ కేసు, ఆ తరవాత స్వాతి మలివాల్‌పై దాడి లాంటి పరిణామాలు అక్కడి రాజకీయాల్ని వేడెక్కించాయి. అందుకే ఈ సారి ఎన్నికలపై ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ నెలకొంది. న్యూ ఢిల్లీ నుంచి దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతితో తలపడనున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఈ సారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది. కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ బరిలోకి దిగగా బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. ఈ సారి కూడా కచ్చితంగా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు తివారి. యూపీలోని సుల్తాన్‌పూర్‌లో బీజేపీ తరపున మనేకా గాంధీ బరిలోకి దిగారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్ బువల్ నిషద్ బరిలో ఉన్నారు.
మరి కొందరు...
ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ ఆజంగర్ నుంచి బరిలోకి దిగారు. 2014,19 ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు. ఒడిశాలోని పూరి నియోజకవర్గంలో బీజేపీ తరపున సంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేడీ తరపున అరుప్ పట్నాయక్, కాంగ్రెస్ నుంచి జయ్ నారాయణ్ పట్నాయక్ బరిలో ఉన్నారు. హరియాణాలోని కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. గుడ్‌గావ్‌లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్ బరిలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్‌తో తలపడుతున్నారు.
Also Read: Elon Musk: భవిష్యత్‌లో ఉద్యోగాలు ఆప్షనల్ అయిపోతాయ్, అన్ని పనులూ AIతోనే - మస్క్ కీలక వ్యాఖ్యలు