Andhra Politcs Drugs Case News :  బెంగళూరులో రేవ్  పార్టీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫామ్ హౌస్‌లో దొరికిన కార్లలో ఒక దానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. అదే సమయంలో ఆ కారులో ఆయన పాస్ పోర్టు దొరికిందన్న ప్రచారమూ సాగింది. కానీ పోలీసులు ఆ కారు కాకాణి గోవర్ధన్ రెడ్డిదని కానీ.. అందులో పాస్ పోర్టు దొరికిందని కానీ చెప్పలేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి బంధువులు కూడా ఎవరూ దొరికినట్లుగా సమాచారం లేదు. అయితే నెల్లూరులో ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ దందాలో ఆయనకూ వాటా ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి స్పందించారు. 
 


సోమిరెడ్డి  తనను వ్యక్తిగతంగా  టార్గెట్‌ చేశారని  బెంగళూరు రేవ్‌ పార్టీతో  ఎలాంటి సంబంధం లేదని  ప్రకటించారు.  డ్రగ్స్‌ ఆరోపణలు చేస్తున్నందున  శాంపిల్స్‌ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.  తన కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. . రిసార్ట్‌ ఓనర్‌ గోపాల్‌రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించాలన్నారు 


బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్‌ అయి రిమాండ్లో ఉన్న వారిలో విజయవాడకు చెందిన వ్యక్తి ఉన్నట్లు వెల్లడైంది. ఎఫ్‌ఐఆర్‌​ (FIR) బయటకు రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఈ పార్టీలో పాల్గొని అరెస్టు అయిన నగరవాసుల సంఖ్య రెండుకు చేరింది.  విజయవాడ వన్ టౌన్  ప్రాంతానికి చెందిన డి.నాగబాబును బెంగళూరు పోలీసులు ఏ3గా ఎఫ్‌ఐఆర్‌(FIR) లో పేర్కొన్నారు. ఈ వేడుకను నిర్వహించిన విజయవాడకు చెందిన బుకీ వాసును ఏ1గా చేర్చారు. తన జన్మదినం సందర్భంగా బెంగళూరు శివారులోని ఓ పామ్ హౌస్ లో వాసు భారీ ఎత్తున రేవ్ పార్టీ  నిర్వహించాడు. దీనికి నాగబాబును కూడా ఆహ్వానించాడు. చివరకు నాగబాబు పార్టీకి వెళ్లి అక్కడ పోలీసులకు చిక్కారు.   


సినీ నటి హేమ పార్టీలో పాల్గొన్నారు. మొదట బుకాయించాలని చూసినా చివరికి ఆమెకు టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది. శ్రీకాంత్  మేక అనే  వ్యక్తి కూడా దొరికారు. ఆయన తెలుగు నటుడు శ్రీకాంత్ అనుకుని పలువురు ఆయనపై ప్రచారం చేస్తున్నారు. కానీ తాను కాదని..తన పేరుతో రాస్తే తానే నోటీసులు పంపుతానని హెచ్చరించారు. నెల్లూరు రాజకీయ నేతలు మాత్రం.. ఈ కేసులో నేరుగా లేకపోయినప్పటికీ ఓ కారుపై ఉన్న స్టిక్కర్ తో మంత్రి కాకాణికి చిక్కులు వచ్చి పడుతున్నాయి.