Lok Sabha Elections 2024 Schedule: ఇవాళ మధ్యాహ్నం (మార్చి 16) 3 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలనూ వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. అయితే...ఈ సారి ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహిస్తుందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకూ 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించింది ఈసీ. మే 23వ తేదీన ఫలితాలు విడుదల చేసింది. ఈ సారి కూడా ఇదే విధంగా 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుందా..? లేదంటే వాటిని తగ్గిస్తుందా అన్న ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిం ఏంటంటే...ఎన్నికలంటే అంత ఆషామాషీ కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను భారీగా పెంచాల్సి ఉంటుంది. ప్రత్యేక భద్రతా బృందాలు, పోలీసులు అందుబాటులో ఉండాలి. కానీ...2019తో పోల్చి చూస్తే జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడమే సవాల్‌గా మారనుంది. గత లోక్‌సభ ఎన్నికల తరవాత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరవాత తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే...ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇక జమ్ముకశ్మీర్‌తో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్నికల నిర్వహణ సవాలుతో కూడుకున్న పనే. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ కొన్ని ఉద్రిక్త ప్రాంతాలున్నాయి. ఇక మణిపూర్‌లో ఇప్పటికే అల్లర్లు జరుగుతున్నాయి.
కశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో ఇప్పటికే ఉగ్రదాడులు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిదని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ రోజుల పాటు ఎన్నికల ప్రక్రియని కొనసాగిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశముందని భావిస్తోంది. అయితే...భద్రత బలగాల్ని ఒకేసారి ఆ స్థాయిలో మొహరించడానికి వీలవుతుందా లేదా అన్నదీ మరో ప్రశ్న. ఇక ఈ ఎన్నికల సమయంలో సైబర్ దాడులు జరిగే ప్రమాదమూ ఉందని ఈసీ అప్రమత్తమైంది. గత లోక్‌సభ ఎన్నికల తరవాత ఈ ఐదేళ్లలో భారత్‌పై సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. చైనా, పాకిస్థాన్ నుంచి ఇవి ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం మరింత జాగ్రత్త పడుతోంది. ఎన్నికల ప్రక్రియని మరీ సుదీర్ఘంగా సాగనివ్వకుండా విడతల్ని తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు..? ఎంత మంది సిబ్బందితో నిఘా పెడతారు..? అన్న వివరాలపైనా ఆసక్తి నెలకొంది. కానీ..ఇవాళ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేస్తే తప్ప దీనిపై ఓ స్పష్టత రాదు.