Elections 2024 Results: హిమాచల్ ప్రదేశ్‌లో మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంగనా రనౌత్ భారీ మెజార్టీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72వేల ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె కీలక ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ విజయమే సంకేతమంటూ ప్రశంసలు కురిపించారు. ఇది సనాతన ధర్మం అని తేల్చి చెప్పారు. మండి ప్రజల ఆత్మగౌరవ గెలుపు అని వెల్లడించారు.
"నాకు మద్దతుగా నిలిచిన మండి నియోజకవర్గ ఓటర్లందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ విజయం మీదే. మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల ఉన్న నమ్మకానికి ఈ విజయమే సంకేతం. మండి నియోజకవర్గ ఆత్మగౌరవ విజయం ఇది"
- కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ అభ్యర్థి
కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ వెనకబడడంపైనా కామెంట్ చేశారు కంగనా రనౌత్. ఆయన సంచి సర్దుకుని వెళ్లిపోవడం మంచిదంటూ సెటైర్లు వేశారు. మహిళని తక్కువ అంచనా వేసినందుకు ఇలాంటి పరిణామాలు అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ తన జన్మభూమి అని, ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని తేల్చి చెప్పారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే ప్రధాని మోదీ నినాదానికి అనుగుణంగా పని చేస్తానని వెల్లడించారు. అంతకు ముందు తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు కంగనా. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.