Elections 2024 Results: సౌత్‌లో చాలా సవాళ్లు ఎదుర్కొంటున్న బీజేపీ మొత్తానికి కేరళలో ఖాతా తెరిచింది. మలయాళ నటుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి సురేశ్ గోపి త్రిసూర్‌లో విజయం సాధించారు. అంతకు ముందు రాజ్యసభ ఎంపీగా ఉన్న సురేశ్ గోపీ ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ప్రత్యర్థిపై ఏకంగా  74,686 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మలయాళ సినిమా యాంగ్రీ మేన్‌గా పేరు తెచ్చుకున్న సురేశ్ గోపి LDF,UDF కంచుకోటని బద్దలు కొట్టారు. ఈ ఫలితంపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 


"నేను త్రిసూర్‌ని గెలుచుకోలేదు. ప్రజలే నన్ను గెలిపించారు. మనస్పూర్తిగా ఆశీర్వదించారు. త్రిసూర్ ప్రజల్ని నా నెత్తిన పెట్టుకుంటాను. మద్దతునిచ్చిన వాళ్లకి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపై ఎంపీగా నా బాధ్యతలు నేను నిజాయతీగా నిర్వర్తిస్తాను"


- సురేశ్ గోపి,బీజేపీ ఎంపీ






LDF నేత, మాజీ మంత్రి వీఎస్ సునీల్ కుమార్‌పై విజయం సాధించారు సురేశ్ గోపి. అటు UDF మూడో స్థానానికే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ 93 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇలాంటి కీలక స్థానంలో సురేశ్ గోపి గట్టిగా నిలబడ్డారు. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. సిట్టింగ్ ఎంపీలను ఓడించడం త్రిసూర్‌లో సహజమే. 2019లో సురేశ్ గోపిని బరిలోకి దించేంత వరకూ కేరళలో NDAకి పెద్దగా బలం లేదు. ఆ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ ఎంతో కొంత ప్రభావం చూపించారు.