Lok Sabha Elections 2024 Phase 7: లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈసీ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉదయం 11 గంటల నాటికి 26.30% పోలింగ్ నమోదైంది. మొత్తం 7 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన పోటీ చేశారు. హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు మరి కొంత మంది ప్రముఖులూ ఈ విడతలో ఉన్నారు. కంగనా రనౌత్, అభిషేక్ బెనర్జీ, మీసా భారతి, పవన్ సింగ్ బరిలో నిలిచారు. ఈ రోజుతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఒకేసారి అన్ని ఫలితాలు విడుదల కానున్నాయి. మిగతా చోట్ల పోలింగ్ సజావుగానే సాగుతున్నప్పటికీ బెంగాల్‌లో మాత్రం అక్కడక్కడా ఉద్రిక్తతుల చోటు చేసుకున్నాయి. జాదవ్‌పూర్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అభ్యర్థి కార్‌ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మరి కొన్ని పోలింగ్ బూత్‌లలోనూ ఇదే వాతావరణం కనిపించింది. ఓ చోట ఏకంగా బూత్‌పై దాడి చేసి ఈవీఎమ్‌ని ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు.
ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ వివరాలు..
బిహార్ 24.25%
ఛండీగఢ్ 25.03%
హిమాచల్ ప్రదేశ్ 31.92%
ఝార్ఖండ్ 29.55%
ఒడిశా 22.64%
పంజాబ్ 23.91%
యూపీ 28.02%
వెస్ట్ బెంగాల్ 28.10%
ఇక ఇప్పటి వరకూ ఈ విడతలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజ్ సింగ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలా అందరూ చొరవ చూపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు.