Lok Sabha Polls 4th Phase: లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత ఎన్నికలకు (Lok Sabha Elections 4th Phase) అంతా సిద్ధమైంది. ఎక్కడికక్కడ పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని చోట్లా భద్రతా బలగాలు మొహరించాయి. సున్నిత ప్రాంతాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నాలుగో విడతలో మొత్తం 96 నియోయజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 9 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. మే 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఈ విడతలో ఏపీలో ఒకేసారి 25 స్థానాలకు, తెలంగాణలో 17 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీలో 13, మహారాష్ట్రలో 11, వెస్ట్‌బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, బిహార్‌లో 5,ఝార్ఖండ్‌లో 4, ఒడిశాలో 4 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఓ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. 


కీలక అభ్యర్థుల జాబితా ఇదే..


ఈ విడతలో కొన్ని నియోజకవర్గాల్లో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. కీలక నేతలు కొందరు ఈ విడతలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. యూపీలని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. అటు పశ్చిమ బెంగాల్‌లో కృష్ణానగర్‌ నుంచి టీఎమ్‌సీ నేత మహువా మొయిత్రా పోటీ చేస్తున్నారు. మాజీ క్రికెటర్‌ యూసుఫ్ పఠాన్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి వెస్ట్‌బెంగాల్‌లోని బహరంపూర్‌లో తలపడనున్నారు. ఇక బిహార్‌లోని బేగుసరైలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా కుంటీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సినీ నటుడు శత్రుఘ్ను సిన్హా అసన్‌సోల్ నుంచి టీఎమ్‌సీ తరపున పోటీ చేస్తున్నారు. 


ఏపీలో వీళ్లే కీలకం..


ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే...ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి Andhra Pradesh Congress Committee చీఫ్‌ వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఇక నెల్లూరులోనూ గట్టి పోటీయే కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ కలెక్టర్ కొప్పుల రాజు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నంలో YSRCP తరపున బొత్స ఝాన్సీ లక్ష్మి, టీడీపీ తరపున భరత్‌ బరిలోకి దిగుతున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కమార్ రెడ్డి బీజేపీ తరపున రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు. అటు వైఎస్‌ఆర్‌సీపీ తరపున పీవీ మధుసూదన్ రెడ్డి బరిలో ఉన్నారు. 


తెలంగాణలో కీలక అభ్యర్థులు..


తెలంగాణలో ఈ నాలుగో విడతలో హైదరాబాద్‌లో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీ లత మధ్య గట్టి పోటీ నెలకొంది. సికింద్రాబాద్‌లో బీజేపీ తరపున జి. కిషన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పద్మారావ్ గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. నిజామాబాద్‌లో బీజేపీ తరపున ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా బీఆర్‌ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. 


Also Read: Kejriwal's Poll Guarantees: దేశవ్యాప్తంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌, 10 ఆసక్తికర హామీలు ప్రకటించిన కేజ్రీవాల్