Kejriwal's Poll Guarantees: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal's 10 Poll Guarantees) ఆసక్తికర హామీలు ఇచ్చారు. I.N.D.I.A కూటమి అధికారంలోకి వస్తే పది గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, ఉచిత విద్యతో పాటు ఢిల్లీకి రాష్ట్రహోదా ఈ హామీల జాబితాలో ఉన్నాయి. భారత్ చైనా సరిహద్దులో చైనా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామనీ స్పష్టం చేశారు. ఈ సమయంలోనే బీజేపీ హామీలపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఫెయిల్ అయ్యాయని, కానీ తమ పార్టీకి హామీలు నెరవేర్చడంలో ట్రాక్ రికార్డ్ ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక వెనకబడిన వర్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో నిరంతర విద్యుత్ అందిస్తున్నామని, ఇదే విధంగా దేశవ్యాప్తంగా సరఫరా అయ్యేలా చూస్తామని చెప్పారు. పది హామీల్లో తొలి ప్రాధాన్యం విద్యుత్‌కే ఇచ్చామని వివరించారు. 3 లక్షల మెగావాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కి ఉందని, కానీ 2 లక్షల మెగావాట్లకే పరిమితం చేస్తున్నారని చెప్పారు. డిమాండ్‌కి మించి విద్యుత్‌ని ఉత్పత్తి చేయొచ్చని అన్నారు. నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాలను మార్చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే అది కచ్చితంగా సాధ్యమవుతుందని అన్నారు. అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయడం, రైతులకు మద్దతు ధర కల్పించడం లాంటి హామీలనూ చేర్చారు.
పది గ్యారెంటీలివే..
1. దేశవ్యాప్తంగా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా. ఎక్కడా కోతల్లేకుండా నిరంతరం విద్యుత్ అందించడం.
2. ప్రైవేట్ స్కూల్స్ కన్నా నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడం.
3. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్‌కి దీటుగా వసతులు కల్పించడం, వైద్యం అందించడం.
4. చైనా ఆక్రమించిన భారత్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనివ్వడం.
5. మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నివీర్ స్కీమ్‌ని రద్దు చేయడం.
6. ఎమ్ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం.
7. ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించడం.
8. ఏటా దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి ఉద్యోగాలివ్వడం.
9. అవినీతిరహిత దేశంగా మార్చడంతో పాటు అవినీతికి పాల్పడే వాళ్లపై కఠినంగా వ్యవహరించడం.
10. జీఎస్‌టీని సరళతరం చేయడం, చైనా వాణిజ్యాన్ని అధిగమించడం.
Also Read: Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా