Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అప్పుడో బోణీ కొట్టింది. ఓ నియోజకవర్గంలో విజయం సాధించింది. అదేంటి..? ఫలితాలు రాకముందే గెలిచినట్టు ఎలా డిక్లేర్ చేశారు..అనేగా మీ అనుమానం. దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సాధారణంగా ఓ నియోజకవర్గంలో రకరకాల పార్టీలకు చెందిన అభ్యర్థులు నిలబడతారు. వాళ్లలో ఎక్కువ ఓట్లు ఎవరికి పోల్ అయితే వాళ్లే గెలిచినట్టు లెక్క. కానీ...గుజరాత్‌లోని సూరత్‌ ఎంపీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్‌కి (MP Mukesh Dalal) ప్రత్యర్థిగా ఎవరూ బరిలో లేరు. ఉన్న వాళ్లంతా ఉన్నట్టుండి ఈ రేసు నుంచి తప్పుకున్నారు. అంటే...ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ మాత్రమే ఉన్నారు. ఇలా ప్రత్యర్థులెవరూ లేనప్పుడు ఉన్న అభ్యర్థే గెలిచినట్టుగా ప్రకటిస్తారు. సూరత్‌లో జరిగింది ఇదే. గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్‌ ముకేశ్‌ గెలిచినట్టుగా ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. నిజానికి కాంగ్రెస్ అభ్యర్థి బరిలోకి దిగినప్పటికీ అతని అప్లికేషన్ ఫామ్‌ని రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంబని తరపున ప్రపోజర్స్ ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల అప్లికేషన్‌ రద్దైంది. 






ఆ నామినేషన్ ఫామ్‌లో ప్రపోజర్స్ సంతకాలు లేకపోవడంపై బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది. ఆ తరవాత కాంగ్రెస్ తరపున మరో అభ్యర్థి నామినేషన్ వేసినా అదీ రిజెక్ట్ అయింది. ఫలితంగా ముకేశ్ దలాల్‌కి పోటీగా ఎవరూ లేకుండా పోయారు. ప్రపోజర్స్ పెట్టాల్సిన సంతకాలనూ అభ్యర్థులే పెట్టడంపై రిటర్నింగ్ ఆఫీసర్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆ అప్లికేషన్స్‌ని బుట్టదాఖలు చేశారు. ఓ రోజు గడువు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రపోజర్స్‌ని తీసుకురాలేకపోయాడు. ఫలితంగా రేసు నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక మిగతా 8 మంది అభ్యర్థులు నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. అయితే...బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ఇలా పోటీలో ఎవరూ లేకుండా చూసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దేశంలో తొలి కమలం వికసించింది అంటూ ఫలితాల ట్రెండ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ముకేశ్ దలాల్. 






Also Read: Lok Sabha Elections 2024: ఎలక్షన్స్‌పైనా వడగాలుల ఎఫెక్ట్, ఎన్నికల సంఘం కీలక భేటీ