Election Results 2024: పశ్చిమ బెంగాల్‌లో భారీ మెజార్టీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్న బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 42 ఎంపీ స్థానాలున్న బెంగాల్‌లో దాదాపు 31 చోట్ల తృణమూల్ కాంగ్రెస్‌ లీడ్‌లో ఉంది. బీజేపీ 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఓ చోట లీడ్‌లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే పైచేయి అని తేల్చి చెప్పాయి. కానీ...అందుకు భిన్నంగా ప్రస్తుత ఫలితాల ట్రెండ్‌ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్టు నిలుపుకునే అవకాశాలున్నాయి. 25 స్థానాలకు పైగా బీజేపీ గెలుచుకుటుందన్న అంచనాలు తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 చోట్ల విజయంససాధించింది. ఈ సారి ఆ సీట్‌లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. డైమండ్ హార్బర్‌లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఏకంగా 6 లక్షల ఓట్ల తేడాతో దూసుకుపోతున్నారు. 2019లో 22 స్థానాలు గెలుచుకున్న తృణమూల్‌ కాంగ్రెస్ ఈ సారి అంత కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశముంది. కృష్ణానగర్‌లో మహువా మొయిత్రా లీడ్‌లో ఉన్నారు. 



అంతకు ముందు మమతా బెనర్జీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ అంచనాలు నిజం కాదు. అవి ఇంట్లో కూర్చుని వేసిన లెక్కలు" అని కొట్టి పారేశారు. 2016,2021 లోనూ ఈ అంచనాలన్నీ తప్పు అని రుజువైన సంగతి గుర్తు చేశారు. ఈ రెండు సార్లూ తృణమూల్‌ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అటు బీజేపీ మాత్రం తాము కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఇప్పుడు ఫలితాల ట్రెండ్‌తో షాక్‌ తగిలింది.