Election Results 2024: రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీని కైవసం చేసుకున్నారు. అంతకు ముందు సోనియా గాంధీ నేతృత్వం వహించిన ఈ స్థానంలో రాహుల్‌ ఆ విజయాన్ని కొనసాగించారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్‌పై 3.9 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. యూపీలోని 80 ఎంపీ నియోజకవర్గాల్లో రాయ్‌బరేలీ అత్యంత కీలకమైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మొదటి నుంచి ఇక్కడ టఫ్‌ ఫైట్‌ ఉంది. చివరి వరకూ ఇక్కడ ఎవరిని నిలబెట్టాలన్న సందిగ్ధంలో ఉండిపోయింది కాంగ్రెస్ హైకమాండ్. సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 
 






వయనాడ్‌లోనూ భారీ మెజార్టీతో గెలుపొందారు రాహుల్ గాంధీ. ఆరు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. CPI అభ్యర్థి అన్నీ రాజా రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 7 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 2004-19 వరకూ సోనియా గాంధీ రాయ్‌బరేలీలో ఎంపీగా వరుసగా గెలిచారు. 2019లో సోనియా గాంధీ లక్షన్నర ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు రాహుల్ అంతకన్నా భారీ మెజార్టీ సాధించారు. రెండు చోట్లా గెలిపించిన ప్రజలకు రాహుల్ థాంక్స్ చెప్పారు. అవకాశం ఉంటే రెండు చోట్లా ఎంపీగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.