Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ప్రధాని మోదీ నేతృత్వంలోని NDA కూటమి 291 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు I.N.D.I.A కూటమి కూడా కాస్త పోటీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. 210 చోట్ల లీడ్‌లో దూసుకుపోతోంది. ఇతర పార్టీలు 20 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ ఈ సారి కచ్చితంగా ఆ మార్క్ చేరుకుంటామని చాలా ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుత ఫలితాల ట్రెండ్ ప్రకారం చూస్తే ఎన్‌డీఏ దూసుకుపోతోందని అర్థమవుతోంది. యూపీలోని అమేథి నియోజకవర్గంలో స్మృతి ఇరానీ లీడ్‌లో ఉన్నారు. అటు రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. వయనాడ్‌లోనూ రాహుల్  దూసుకుపోతున్నారు. మొత్తం 543 స్థానాలున్న లోక్‌సభకి 542 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న NDA తమ గెలుపుపై కాన్ఫిడెంట్‌గా ఉంది. కీలక అభ్యర్థులు బరిలో దిగిన చోట ప్రస్తుతానికి టఫ్ ఫైట్‌ కొనసాగుతోంది. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠను పెంచుతోంది.