Election Results 2024: NDA కూటమి 300 మార్క్ దాటేందుకే కష్టపడుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. బ్యాగ్ సర్దుకుని హిమాలయాలకు వెళ్లిపోండి అంటూ చురకలు అంటించారు. 2016లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలనే కోట్ చేస్తూ విమర్శించారు. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆలస్యం చేయకుండా సంచి సర్దుకోవాలని అన్నారు. 


"2016లో మొరాదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారో గుర్తుందా..? నన్నేం చేయగలరండి..? నేనో పేదవాడిని. అనుకోనిది ఏదైనా జరిగితే బ్యాగ్ సర్దుకుని హిమాలయాలకు వెళ్లిపోతాను అని మోదీ అన్నారు. ప్రధాని మోదీజీ ఈ వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా..? మీ బ్యాగ్ సిద్ధం చేసుకోండి. హిమాలయాలకు వెళ్లిపోండి"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత




అందరికీ షాక్ ఇచ్చిన విషయం ఏంటంటే వారణాసిలో ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటికే మోదీ వెనకంజలో ఉన్నారు. దాదాపు 7 వేల ఓట్ల తేడాతో వెనకబడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ లీడ్‌లో ఉన్నారు. ఆ తరవాత మళ్లీ మోదీ లీడ్‌లోకి వచ్చారు. కానీ వెనకబడిన ఆ కాసేపు బీజేపీ శ్రేణులు టెన్షన్ పడ్డాయి. తరవాత లక్ష మెజార్టీతో దూసుకుపోయారు. కానీ...మొత్తంగా ఫలితాల ట్రెండ్‌ని చూస్తుంటే...బీజేపీకి 400 సీట్‌లు రావడం కష్టంగానే ఉంది. NDAతో పోటాపోటీగా ఇండీ కూటమి దూసుకుపోతోంది. యూపీ, మహారాష్ట్రతో పాటు తమిళనాడులోనూ కూటమి ప్రభావం గట్టిగా కనిపిస్తోంది.