Lok Sabha Election 2024 Schedule: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తామని, అందరూ ఇందుకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) గురించి ప్రస్తావించారు. ప్రచారం చేసే సమయంలో రాజకీయ పార్టీలు హద్దులు మీరి ప్రవర్తించొద్దని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అనవసరంగా ఎవరూ నోరు జారొద్దని స్పష్టం చేశారు. స్టార్ క్యాంపెయినర్ల బాధ్యతలకు సంబంధించీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే చాలా సార్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనని ఉల్లంఘించిన ఘటనలు నమోదయ్యాయని,వాటిని దృష్టిలో పెట్టుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కులం, మతం పేరుతో దూషించుకోడంపైనా హెచ్చరించారు. అలాగే వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు రాజీవ్ కుమార్. మార్గదర్శకాల్లో ఇవి కూడా ప్రస్తావించినట్టు తెలిపారు.
"ఇప్పటికే చాలాసార్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం. రాజకీయ పార్టీలన్నింటినీ అప్రమత్తం చేశాం. స్టార్ క్యాంపెయినర్లు అందరికీ మేం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని కాపీలని పంపాలని సూచించాం. ప్రచారం చేసే వాళ్లందరికీ ఈ గైడ్‌లైన్స్ వర్తిస్తాయి. కచ్చితంగా ఆ నిబంధనలు పాటించాలి. గతంలోనూ ఇలా చేసినా రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అంత సులభంగా తీసుకోం. నిబంధనలు ఉల్లంఘిస్తే అవసరమైన చర్యలు తీసుకోడానికి ఏ మాత్రం వెనకాడం"
- రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్