Lok Sabha election 2024 Phase 4 Polling: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి ఇక్కడ పోలింగ్ జరుగుతుండడం వల్ల ఉత్కంఠ నెలకొంది. ఎక్కడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే...కశ్మీరీ వలసదారుల కోసం ఎన్నికల అధికారులు స్పెషల్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. జమ్మూలోని నగ్రోటాలో జగతీ క్యాంప్‌ వద్ద ఈ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటైంది. కశ్మీరీ మైగ్రెంట్స్‌ అందరూ ఇక్కడికే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీళ్లపై ఎలాంటి దాడులు జరగకుండా అదనపు భద్రత కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూతో పాటు ఢిల్లీలో నాలుగు, ఉధంపూర్‌లో ఒక పోలింగ్‌ బూత్‌ కేవలం వీళ్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసినట్టు చెప్పారు. 






2019లో జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరవాత జరుగుతున్న తొలి ఎన్నికలివే. ఈ అధికరణ రద్దు చేసిన ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. శ్రీనగర్‌, గందేర్బల్, పుల్వామా, బుడ్గాం, షోపియన్ జిల్లాల్లో కలిపి మొత్తం 17.48 లక్షల ఓటర్లున్నారు. మొత్తం 5 జిల్లాల్లో ఎన్నికల అధికారులు  2,135 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి, I.N.D.I.A కూటమి మద్దతునిస్తోంది.