Lok Sabha Election 2024 Ends: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 7 విడతల పోలింగ్‌ ఇవాళ్టితో (జూన్ 1) పూర్తైంది. చివరి విడతలో 7 రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ విడతలోనే ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలో ఉన్నారు. ఆయనతో పాటు మరి కొందరు ప్రముఖులూ ఇదే విడతలో రేసులో ఉన్నారు.


ఏడో విడతలో సాయంత్రం 5 గంటల నాటికి మొత్తం 58.3% పోలింగ్ నమోదైనట్టు ఈసీ అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 19వ తేదీన మొదటి విడత పోలింగ్‌ మొదలైంది. సుదీర్ఘంగా దాదాపు 44 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మధ్యలో పబ్లిక్ హాలిడేస్ రావడం, పరీక్షలు ఉండడం, పండుగలు రావడం లాంటి కారణంతో ఇలా షెడ్యూల్‌ని పొడిగించాల్సి వచ్చిందని ఈసీ ప్రకటించింది.


ఏడు విడతలు కూడా ప్రశాంతంగానే జరిగాయి. బెంగాల్‌లో మాత్రం అక్కడక్కడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన క్రమంలో అందరూ జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియగానే అంతా ఎగ్జిట్ పోల్స్ పై ఫోకస్ చేస్తారు. పలు ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను ఈసీ నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం 6.30 గంటల తరువాత విడుదల చేశాయి.