Paruchuri Gopala Krishna About Family Star: టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలపై అప్పుడప్పుడు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. యావరేజ్ టాక్ అందుకున్నా కూడా సినిమాలోని చాలావరకు సీన్స్‌పై విమర్శలు వచ్చాయి. పరశురామ్ దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీ స్టార్’.. చాలామంది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ మూవీపై ఫైనల్‌గా తన అభిప్రాయం కూడా చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.


పిసినారి కాదు జాగ్రత్తపరుడు..


‘‘చాలా అహం ఉన్న అబ్బాయికి, అమ్మాయికి ఒక అనుబంధం ఏర్పడితే అది ఎన్ని రకాల పరిణామాలను చవిచూస్తుంది అనే ‘ఫ్యామిలీ స్టార్’ కథ. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ డెవలప్ అవుతుంది అనే ఆలోచనలో పడిపోతాం. హీరోను పిసినారిలా చూపించారు. కానీ అతడు అతి జాగ్రత్తపరుడు అని కథాంశం చూసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. తన వయసుకు మించిన వాళ్లకి సలహాలు ఇచ్చే క్యారెక్టర్. కథనా చాతుర్యంతో ఒకరకంగా దర్శకుడు పరశురామ్ ఆడుకున్నాడు. సినిమా గురించి కలెక్షన్స్, టాక్ చూస్తుంటే చాలా తేడాగా కనిపిస్తున్నాయి. అంత తేడా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. హీరో యూత్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌లో తెలియకుండానే మాస్ బాడీ లాంగ్వేజ్‌ను కలిపాడు దర్శకుడు’’ అంటూ ‘ఫ్యామిలీ స్టార్’ గురించి పాజిటివ్‌గా చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.


కథ వేరేలాగా ఉండేది..


‘‘విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించాడు. కానీ అనుకున్న రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే హీరో ఇమేజ్‌కు భిన్నంగా ఉండడం వల్ల, ఫైట్ల వల్ల దెబ్బతిన్నాడు. హీరోయిన్ హీరోను ఇష్టపడింది. కానీ అప్పుడు తను చేసిన పనికి హీరోకు కోపం వచ్చి తనను పంపించేశాడు. అలా కాకుండా అప్పుడే అమ్మాయి రివర్స్ అయ్యి ‘‘పిచ్చోడా ఐ లవ్ యూ’’ అనుంటే కథ ఇలా కాకుండా వేరేలాగా ఉండేది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ పరశురామే రాశాడు కాబట్టి చాలా చమత్కారాలు చూపించాడు. జగపతి బాబు వచ్చి తనే నా కూతురు అని చెప్పేవరకు హీరోయిన్ గురించి తెలియకుండా వర్కవుట్ చేశారు. హీరోయిన్ అపార్థం చేసుకునే సినిమాలు ఎక్కువగా హిట్ అవుతాయి. కానీ ఫ్యామిలీ స్టార్‌లో హీరో తన ఈగోతో హీరోయిన్‌ను అనవసరంగా దూరం చేసుకుంటున్నాడు అనేది బాగా చూపించారు’’ అని వివరించారు పరుచూరి.


లవర్ బాయ్..


‘‘కొన్ని సీన్స్‌లో హీరోయిన్‌ను హీరో అవసరానికి ఉపయోగించినట్టు అనిపించింది. క్లైమాక్స్‌లో హీరో 50, 60 మందిని కొట్టినట్టు చూపించారు. మరి ఆడియన్స్ వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో తెలియదు. ఇది విజయ్ దేవరకొండ కథే. కానీ కథనంలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌ను దాటిన ట్రీట్మెంట్ ఉంది. ఎన్ని ఉన్నా సినిమా బాలేదు అనడానికి మాత్రం నోరు రాదు. అక్కడక్కడా బాలేదు. సెకండ్ హాఫ్‌లో 15, 20 నిమిషాలు తీసేసుంటే ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ఇంకొక రకంగా ఉండేదా అన్నది నా పర్సనల్ ఫీలింగ్. విజయ్ దేవరకొండ ఒక లవర్ బాయ్. ఆ లవర్ బాయ్‌కు తగిన కథను రాస్తే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారు’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు విజయ్ దేవరకొండ.


Also Read: 'పుష్ప 2' సెకండ్ సాంగ్‌పై కాపీ ఆరోపణలు - ఆ సాంగ్‌ నుంచి లేపేశారా? దేవిశ్రీపై ట్రోల్స్‌