Kajal Aggarwal Interview With DCP Srujana Karnam: సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లయ్యి, బాబు పుట్టిన తర్వాత సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యింది. అంతే కాకుండా తన స్క్రిప్ట్ సెలక్షన్‌లో కూడా మార్పులు వచ్చింది. ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, స్టార్ హీరోల సరసన నటిస్తూ కనిపించే కాజల్.. మొదటిసారి ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన చిత్రమే ‘సత్యభామ’. ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కర్ణంతో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది కాజల్.
11 షీ టీమ్స్..
‘సత్యభామ’ సినిమాలో మహిళలకు అండగా నిలబడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది కాజల్ అగర్వాల్. అలాగే రియల్ లైఫ్‌లో సృజన కర్ణం కూడా అదే వృత్తిలో ఉన్నారు. దీంతో అసలు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉమెన్ సేఫ్టీ అనేది ఎలా ఉంది అని సృజన చెప్పుకొచ్చారు. ‘‘సైబరాబాద్ మొత్తానికి కలిపి 11 షీ టీమ్స్ ఉన్నాయి. దాంతో పాటు హ్యామన్ ట్రాఫికింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా వ్యభిచారానికి సంబంధించిన కేసులను డీల్ చేస్తాయి. ఈమధ్య మెట్రో రైళ్ల కింద వ్యభిచారం అనేది జరుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. షీ టీమ్స్‌కు ప్రత్యేకంగా నెంబర్లు ఉంటాయి. ఆ టీమ్స్ గురించి వారే అవగాహన కల్పించాలి’’ అని తెలిపారు సృజన కర్ణం.
అత్యవసర పరిస్థితుల కోసం SOS..
‘సత్యభామ’ సినిమాలో కూడా షీ టీమ్స్‌కు సంబంధించిన యాప్ ఉపయోగించామని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. ‘‘సినిమాలో ఒక కీలక సన్నివేశం ఉంది. ఆ సీన్‌లో షీ టీమ్ ఉపయోగపడుతుంది’’ అని తెలిపింది. అలాగే SOS అంటే ఏంటో కూడా సృజన తెలిపారు. ‘‘ఏ ఫోన్ అయినా కూడా మూడుసార్లు బటన్ ప్రెస్ చేస్తే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వెళ్తుంది. అత్యవరసర పరిస్థితుల్లో ఈ SOS ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. అలాగే డయల్ 100 కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య ఉండి 100కు కాల్ చేస్తే 5 నిమిషాల్లో పోలీసులు వస్తారు. ఈమధ్య 100కు వచ్చిన కాల్‌ను పోలీస్ స్టేషన్‌కు డైవర్ట్ చేయకుండా దగ్గర్లో పాట్రోలింగ్‌లో ఉన్న పోలీస్ అధికారులకు ఇస్తున్నారు అలా ఈ సేవలు మరింత వేగవంతం అయ్యాయి’’ అని వివరించారు సృజన కర్ణం.
భరోసా సెంటర్లు అంటే ఏంటి.?
ఇటీవల ప్రారంభమయిన ‘భరోసా’ సెంటర్ల గురించి కూడా సృజన క్లారిటీ ఇచ్చారు. ‘‘భరోసా సెంటర్ అంటే ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అది అలా కాదు. ఒకప్పుడు చిన్నపిల్లలను రేప్ చేస్తే వాళ్ల స్టేట్‌మెంట్ తీసుకోవడానికి వాళ్ల ఇంటికి వెళ్లేవారు. దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని భరోసా సెంటర్లను ఏర్పాటు చేశారు. లైంగికంగా వేధింపులకు గురైన చిన్నపిల్లలను భరోసా సెంటర్‌కు తీసుకొచ్చి స్టేట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇది కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. రేప్‌కు గురైన చిన్నపిల్లలకు ఎలాంటి సాయం కావాలన్నా భరోసా సెంటర్లు చేస్తాయి’’ అని తెలిపారు సృజన కర్ణం.
Also Read: పోలీసులతో నివేతా పేతురాజ్ గొడవ - ఇదంతా 'పరువు' కోసమేనట, జీ5 క్లారిటీ!