Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. హ్యాట్రిక్‌ సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. బిహార్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వినోద్‌ తవ్‌దే, ఝార్ఖండ్‌కి లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, హరియాణాకి విప్లవ్ కుమార్ దేవ్‌ని ఎంపిక చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ పోలింగ్ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్ల సంఖ్య కోటి 73 లక్షల వరకూ ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం కోటిన్నర మంది సిబ్బందిని నియమించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 1951 నాటికి దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1957 నాటికి అది 19.37 కోట్లకు పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 91.20 కోట్లుగా ఉంది. ఇప్పుడది 96 కోట్లకు పెరిగింది. ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్లలో 18 లక్షల మంది దివ్యాంగులున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 67% ఓటింగ్ నమోదైనట్టు ఈసీ స్పష్టం చేసింది. 






లోక్‌సభ ఎన్నికలకు మరి కొద్ది నెలల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మొదలు పెట్టింది. Modi Ko Chunte Hain పేరుతో ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ప్రత్యేకంగా ఓ పాట కూడా విడుదల చేసింది. "కల కాదు..ఇదే నిజం. మళ్లీ ప్రజలు మోదీనే ఎన్నుకుంటారు" అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బీజేపీ నేతలు.ఇప్పటికే వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. నిజానికి గత రెండు టర్మ్స్ కన్నా ప్రధాని మోదీ చరిష్మా ఈ సారి మరింత పెరిగింది. పైగా అయోధ్య రామ మందిర నిర్మాణంలో (Ayodhya Ram Mandir) మోదీ చూపించిన చొరవ ఆయన క్రేజ్‌ని పెంచేశాయి. అందుకే మూడోసారీ ప్రధానిగా మోదీయే ప్రమాణ స్వీకారం చేస్తారని చాలా ధీమాగా చెబుతున్నాయి బీజేపీ వర్గాలు.


Also Read: Mutton Biryani Prasadam: ఆ ఆలయంలో ప్రసాదంగా వేడివేడి మటన్ బిర్యానీ, క్యూ కడుతున్న భక్తులు