Mutton Biryani As Prasad: తమిళనాడులోని మదురైలో మునియంది స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇందులో వింతేముంది..? ఆలయం అన్నాక భక్తులు వస్తారుగా అని మనం చాలా సింపుల్‌గా అనుకోవచ్చు. కానీ...ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అక్కడి అంత మంది తరలి రావడానికి భక్తితో పాటు మరో కారణమూ ఉంది. అక్కడ ప్రసాదంగా మటన్ బిర్యానీ పెడుతున్నారు. ఇప్పుడర్థమైందిగా అసలు సంగతేంటో. మదురైలోని వడక్కంపట్టిలో ఉన్న Muniyandi Swami Temple లో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ సమయంలో ప్రసాదంగా భక్తులకు మటన్ బిర్యానీ పెడతారు. ఇంకేముంది ఫ్రీగా బిర్యానీ వస్తుందంటే ఊరుకుంటారా..? భక్తి ఉన్నా లేకపోయినా కేవలం ఆ మటన్ బిర్యానీని రుచి చూసేందుకు క్యూ కడుతున్నారు. మునియంది స్వామికి బిర్యానీ అంటే చాలా ఇష్టమని అందుకే అదే ప్రసాదంగా పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. 






బిర్యానీ ఎందుకు..?


ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1973లో ఓ హోటల్ బిజినెస్ మొదలు పెట్టిన ఓ వ్యాపారి బాగా సక్సెస్ అయ్యాడు. ఆ సమయంలోనే మునియంది స్వామిని దర్శించుకున్నాడు. తన వ్యాపారం సక్సెస్ అవ్వడానికి స్వామే కారణం అని భావించాడు. కృతజ్ఞతగా పెద్ద వేడుక చేయాలనుకున్నాడు. అప్పుడే భారీ ఎత్తున వేడుకలు చేశాడు. ఆ తరవాత అదో ఆనవాయితీగా మారింది. స్థానికులు, చుట్టు పక్కల గ్రామస్థులు తమ వ్యాపారాలు బాగుండాలని ఇక్కడికే వచ్చి వేడుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. మాంసాహారం మాత్రమే స్వామికి నైవేద్యంగా పెడతారు. అలా అయితేనే ఆయన సంతృప్తి చెంది తమ కోరికలు తీర్చుతాడని నమ్ముతారు. దక్షిణ భారతంలో దాదాపు 500 హోటళ్లు మునియంది స్వామి పేరుతోనే నడుస్తున్నాయంటే..ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వార్షికోత్సవాలు జరిగిన సమయంలో మాత్రం స్థానికంగా హోటల్ బిజినెస్‌లు చేసుకునే వాళ్లంతా కలిసి పెద్ద ఎత్తున ఆలయానికి విరాళాలిస్తారు. ఎంత ఖర్చైనా సరే మటన్ బిర్యానీనే ప్రసాదంగా వడ్డిస్తారు. ఒక్కో వర్గం కనీసం ఓ టన్ను బిర్యానీని విరాళంగా ఇస్తుంది. వెయ్యి కిలోల బియ్యం, 500 కిలోల మటన్‌తో ఈ ప్రసాదాన్ని వండిస్తారు. తాము అంతగా ఎదగడానికి కారణమైన స్వామికి ఇలా రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు స్థానికులు.