UK PM Resigns:  బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. టాక్స్ కట్ పాలసీ తీవ్రంగా వివాదాస్పదమవడంతో, ఆ పాలసీని ఆమె వెనక్కు తీసుకున్నారు. ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ ను పదవి నుంచి తొలగించారు. హోంమంత్రి రాజీనామా చేశారు. చివరికి తాను కూడా వైదొలిగారు. దీంతో బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది.  


 





 అనేక హామీలు ఇచ్చి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ 


కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు చేసుకున్నారన్న కారణంగా విమర్శలు రావడం, పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో గత ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధాని పదవి కోసం జరిగిన రేసులో  భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ పోటీ పడ్డారు. లిజ్ ట్రస్ ముందంజ వేసి ప్రధాని పదవి చేపట్టారు.  లిజ్ ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని విమర్శలు ప్రారంభమయ్యాయి.   నిజానికి లిజ్ ట్రస్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాల్సిన పని లేదు. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనల ప్రకారం  మరో ఏడాది పాటు లిజ్ ట్రస్‌, అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే అవసరం ఉండదు. కానీ ఎంపీలు తీవ్ర అసంతృప్తిలో ఉండటం... దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడటంతో ఆమె రాజీనామాకే మొగ్గు చూపారు. 


ఆర్థిక పరమైన నిర్ణయాల వల్ల బ్రిటన్‌లో సంక్షోభం


 ప్రధానిగా ఎన్నికయ్యేందుకు లిజ్ ట్రస్ అనేక హామీలుఇచ్చారు.  ప్రధాని ఎన్నికల సమయంలో ఆమె ప్రత్యర్థి రిషి సునక్‌ కార్పొరేషన్‌ పన్నును 25 శాతానికి పెంచుతానని హామీ ఇవ్వగా.. లిజ్‌ ట్రస్‌ మాత్రం.. పన్నును 19 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. లిజ్‌ ట్రస్‌ చెప్పినట్టుగా కార్పొరేట్‌ పన్నును 25 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంన్నారు. కొర్పారేట్‌ పన్నును పెంచుతున్నట్టు   ప్రకటించారు. దీంతో ఆమె మాట తప్పారని రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపించడం ప్రారంభమయ్యాయి. సవాళ్లు పెరిగిపోవడంతో  ఆర్థికమంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ని తొలగించి.. ఆయన స్థాంలో జెరెమీ హంట్‌ని నియమించారు.  


రాజీనామా చేయక తప్పని పరిస్థితి.. నెలన్నరకే పదవీ గల్లంతు


బ్రిటన్‌లో గతంలో ఎన్నడూలేనంతగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో లిజ్‌ట్రస్‌కి ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. లిజ్‌ట్రస్‌ దేశ ఆర్థిక పరిస్థితులపై తన వ్యూహాలు పనిచేయడం లేదని... విమర్శలు ప్రజల నుంచీ వచ్చాయి.చివరికి లిజ్ ట్రస్‌కు రాజీనామా చేయడం మినహా మరో మార్గం లేదని అర్థమైంది. సొంత పార్టీలోనూ మద్దతు రాలేదు. ప్రజలూ ఆమె పనితీరుపై అంత సానుకూలత వ్యక్తం చేయలేదు. చివరికి ఆమె  పదవి నుంచి వైదొలగడమే మంచిదని నిర్ణయించుకుని ఆ మేరకు అధికారిక ప్రకటన చేశారు.