Delhi Liquor Policy Case: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి గట్టి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అయితే..ఈ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించింది. ఏప్రిల్ 22వ తేదీన మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది.
ఈడీ సమన్లు జారీ చేయకుండా స్టే విధించాలని కూడా కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మార్చి 20వ తేదీన విచారణ జరిపించింది. స్టే విధించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఈడీని వివరణ కోరింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ని తిరస్కరించిన కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్ మరో పిటిషన్ వేశారు. తనను అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ అభ్యర్థననీ కోర్టు తిరస్కరించింది.