Liquor Policy Case:
ఈడీ పిటిషన్
ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియా కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. సిసోడియా విచారణకు మరో 7 రోజుల సమయం కావాలని, కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టుని కోరగా...ఐదు రోజుల పాటు పొడిగించేందుకు అంగీకరించింది. సిసోడియా తన ఫోన్లను నిర్వీర్యం చేశాడని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తేల్చి చెప్పింది. సిసోడియా తరపు న్యాయవాది ఈడీ రిమాండ్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. అటు ఈడీ మాత్రం సిసోడియా ఫోన్‌లు,ఈ మెయిల్స్‌ను ఫోరెన్సిక్ అనాలసిస్ చేస్తున్నామని కోర్టుకు తెలిపింది. సిసోడియా కస్టడీలో ఉన్న సమయంలోనే కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని తేల్చి చెప్పింది. గతేడాది ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాపై కేసు నమోదైన వెంటనే ఆయన తన మొబైల్ మార్చేశారని ఆరోపించింది. ఆ ఫోన్‌ను ఏం చేశారో అన్నది మాత్రం చెప్పలేకపోతున్నామని తెలిపింది. 2021 మార్చి నాటి డాక్యుమెంట్‌ల ఆధారంగా చూస్తే ఈ పాలసీలో సిసోడియాకు 5% కమీషన్ ఉన్నట్టు చెబుతోంది ఈడీ. అయితే 2022 సెప్టెంబర్ నాటికి అది 12%కి పెరిగిందని వివరించింది. సిసోడియా తరపు న్యాయవాది మాత్రం దర్యాప్తు సంస్థలు చెప్పిందే చెబుతున్నాయి తప్ప కొత్త ఆధారాలేవీ వెలుగులోకి తీసుకురావడం లేదని వాదిస్తున్నారు. వారం రోజుల పాటు కస్టడీలో ఉంచినా...మొత్తం మీద ఆయనను 10-12 గంటల మాత్రమే ప్రశ్నించారని చెబుతున్నారు. ఈడీ మాత్రం తాము రోజుకి 5-6 గంటల పాటు విచారిస్తున్నట్టు చెబుతోంది.