Monalisa Viral News: మెరిసే కళ్లు, చక్కటి నవ్వుతో తళుక్కుమనిపించిన ఇంటర్నెట్ సెన్సేషన్, మహా కుంభమేళాలో కొన్ని రోజులుగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా తన స్వస్థలానికి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. భద్రత కారణంగానే తాను కుంభమేళా నుంచి వెళ్లిపోతున్నానని, సాధ్యమైతే మళ్లీ తిరిగి వస్తానని కూడా చెప్పింది. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుండగా.. ఇటీవలి కాలంలో ఆమెతో ఫొటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు జనాలు ఎగబడ్డ పరిస్థితులను బట్టి చూస్తే.. ఆమె ప్రయాగ్ రాజ్ నుంచి వెళ్లిపోవడమే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోనాలిసా తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియోలో.. మహా కుంభమేళాలో తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. తన కోసం, తన కుటుంబం భద్రత కోసమే తమ స్వస్థలమైన ఇండోర్ కు వెళ్తున్నట్టు తెలిపింది. వీలైతే మళ్లీ ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వస్తానని చెప్పింది. తనకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచుతున్న వారందరికీ ఆమె ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసింది.
మోనాలిసా ఎవరంటే..
మోనాలిసా అసలు పేరు మోనాలిసా భోంస్లే. ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ ఇండోర్ కు సమీపంలోని మహేశ్వర్. అయితే ఈ మధ్య ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమైన మహా కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్ కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మోనాలిసా రాత్రికి రాత్రే సెన్సేషన్ అయిపోయింది. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లయెన్సర్.. మోనాలిసాను కొన్ని ప్రశ్నలు అడుగుతున్న వీడియోను షేర్ చేయడంతో.. వెంటనే వైరల్ అయిపోయింది. అప్పటివరకూ సాధువులు, భక్తులు అంటూ వెలువడిన వార్తలు ఒక్కసారిగా ఆగిపోయాయి. దాదాపు అన్ని మీడియాలు ఆమెను కవర్ చేశాయి. అట్రాక్టివ్ కళ్లు, స్వచ్ఛమైన చిరునవ్వును చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇంకేముంది వచ్చిన వారంతా మోనాలిసాను చూసేందుకు ఎగబడ్డారు. ఫోన్లు, కెమెరాలతో ఆమె వెంట పరిగెత్తారు.
వీడియోలు, ఇంటర్వ్యూలు అంటూ మోనాలిసాను ఓ రకంగా తీవ్ర వేధింపులకు గురి చేశారు. తమ చేసికోనివ్వకుండా బయటకు రావాలంటేనే భయం కలిగేలా చేశారు. దీంతో ఆమె ఒకానొక దశలో వారి నుంచి తప్పించుకునేందుకు, రక్షించుకునేందుకు ముఖానికి మాస్క్ పెట్టుకుని.. తన మొహం కనిపించకుండా వెళ్లిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వెలువడ్డాయి. అలా ఆమెను కాపాడేందుకు ఆమె ఫ్యామిలీ సైతం ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఇక చేసేదేంలేక ఆమె తన ఫ్యామిలీతో సహా ఇండోర్ బయల్దేరింది.