Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో అత్యంత వేడుకగా జరుగుతోన్న మహా కుంభమేళాలో మరోమారు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఆగి ఉన్న రెండు వాహనాల్లో మంటలు చెలరేగడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ఘటనపై వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తగ్గింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.
వేడి కారణంగా వాహనాల్లో చెలరేగిన మంటలు
రెండో సారి మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం జరగడంతో అధికారులంతా వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక అధికారి విశాల్ యాదవ్.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ వాహనాలను ఇక్కడే పార్క్ చేస్తున్నారు. దీంతో విపరీతమైన వేడి కారణంగా వాహనాల్లో మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఎర్టిగా కారు పూర్తిగా, వెన్యూ కారు పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, అందరూ సురక్షితంగానే ఉన్నారు’’ అని స్పష్టం చేశారు.
కొన్ని రోజుల క్రితమే కిన్నార్ అఖారా ఎదురుగా ఉన్న టెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి గుడారాల్లో మంటలు చెలరేగాయి. తులసి మార్గ్‌లోని సెక్టార్-19 దగ్గర స్వాముల కోసం ఏర్పాటు చేసిన దాదాపు 30 టెంట్లకు ఈ మంటలు వ్యాపించడంతో సమీపంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే సకాలంలో మంటలు ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. మంటలు చెలరేగిన వెంటనే స్థానిక భక్తులు బకెట్లలో నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారని, వాచ్‌టవర్ వద్ద ఉన్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. అంతలోనే మరోసారి అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు వెంటనే అప్రమత్తారు. గతంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పందించేలా సమాయత్తమయ్యారు. ఏదేమైనా రెండు సార్లు జరిగిన ప్రమాదాల్లోనూ ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగకపోవడం మంచి విషయం.
Also Read : Real Estate: రియల్ ఎస్టేట్ సెక్టార్ 'పరిశ్రమ' కల నెరవేరుతుందా, బడ్జెట్ నుంచి ఈ రంగం ఏం ఆశిస్తోంది?