Leak Videos Row:
కఠినంగా శిక్షిస్తామంటున్న సర్కార్..
పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. క్యాంపస్‌లోని హాస్టల్‌లో విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం అలజడికి కారణమైంది. అయితే...ఇదంతా అవాస్తవమని యూనివర్సిటీ చెబుతోంది.
విద్యార్థినులు మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు...పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
అంతకు ముందే ఆప్ సీనియర్ నేతలంతా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులెవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. "ఇది ఎంతో సిగ్గుచేటు. అమ్మాయిలందరూ మానసికంగా దృఢంగా ఉండాలి" అని ట్వీట్ చేశారు. నిందితులను కచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలబడతామని చెప్పారు. అందరూ సహనంగా ఉండాలని సూచించారు.
అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ట్వీట్ చేశారు. "దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాను. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం. అందరితోనూ నేనూ సంప్రదింపులు జరుపుతున్నాను. అప్పటి వరకూ రూమర్స్ వ్యాప్తి చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, వదంతులు వ్యాప్తి చేయొద్దని పంజాబ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గురుమీత్ సింగ్...ట్వీట్ చేశారు. "యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత మాది. ఇప్పిటికే విచారణకు ఆదేశించాం" అని చెప్పారు. అయితే... వీడియోలు లీక్ అయిన తరవాత కొందరు యువతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. ప్రో వైస్‌ఛాన్స్‌లర్ కూడా ఇదే విషయం వెల్లడించారు. అలాంటి వార్తలు నమ్మొద్దనిఅన్నారు.
ఆ వీడియోల వల్లే..
యూనివర్సిటీ హాస్టల్‌లో తోటి విద్యార్థినిలు స్నానం చేస్తున్న వీడియోలను తీసిన ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌కు వాటిని పంపింది. మొత్తం 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను అతను ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు పోర్న్ సైట్‌లో కనిపించడంతో యూనివర్సిటీ విద్యార్థినిలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమాన భారంతో 8 మంది విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్ యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల వాహనాలపై విద్యార్థులు రాళ్లు రువ్వారు.
Also Read: Iran Hijab Protest: రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించిన మహిళలు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం