చిక్కుల్లో లేయర్స్ షాట్ డియోడ్రెంట్ కంపెనీ
తనను ఏ అమ్మాయీ చూడటం లేదని, తనతో చనువుగా తెగ బాధ పడిపోతున్నాడు ఓ యువకుడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ యువకుడికి ఓ డియోడ్రెంట్ అందిస్తాడు. అది స్ప్రే చేసుకోగానే వెంటనే అతని చుట్టూ అమ్మాయిలు వచ్చేస్తారు. ఈ యాడ్ ఎక్కడో చూసినట్టుంది కదా. చూసినంత సేపు కామెడిగానే అనిపించినాతరవాత కాస్త లోతుగా ఆలోచిస్తే ఆ ప్రకటన ద్వారా సంస్థలు ఏం చెప్పాలనుకుంటన్నాయన్న సందేహం రాకమానదు. ఇప్పుడు ఇలాంటి యాడ్‌నే చేసి లేయర్స్ షాట్ కంపెనీ చిక్కుల్లో పడింది. ఈ యాడ్‌పై మహిళా సంఘాలన్నీ భగ్గుమంటున్నాయి. ఈ ప్రకటనలో వాడిన భాష అసభ్యంగా ఉందని తీవ్రంగా మండిపడుతున్నాయి.
యాడ్‌ని వెంటనే తొలగించండి: ఐబీ శాఖ ఆదేశాలు
దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఈ యాడ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంస్థపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ యాడ్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్వాతి మలివాల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో పలువురు మహిళలూ ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటాన్ని గమనించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. మహిళల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్న ఈ ప్రకటనపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని ట్విటర్, యూట్యూబ్‌లకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటన ఐటీ చట్టం-2021లోని నిబంధనలను అతిక్రమించేలా ఉందని తేల్చి చెప్పింది.
ఇంగ్లాడ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఈ యాడ్ ప్రసారం చేయటం వల్ల వివాదాస్పదమైంది. ఇప్పుడే కాదు, గతంలోనూ లేయర్స్ షాట్ చేసిన యాడ్‌పై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ సారి కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే యాడ్ చేయటం వల్ల మహిళా సంఘాలు విరుచుకు పడ్డాయి. నెటిజన్లు లేయర్స్ షాట్ సోషల్ మీడియా అకౌంట్స్‌ని ట్యాగ్ చేస్తూ, తిడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.