Pithapuram News : కాకినాడ జిల్లా పిఠాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన టీడీపీ దళిత గర్జనను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున దళిత గర్జనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను శుక్రవారం రాత్రి నుంచి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వర్మ ఇంటి నుంచి తప్పించుకొని పిఠాపురం ఆఫీస్ చేరుకొన్నారు. దీంతో పిఠాపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద పోలీస్ బలగాలను మెహరించారు. మీడియా పైనా ఆంక్షలు విధించిన పోలీసులు టీడీపీ కార్యాలయానికి వెళ్లే అన్ని దారులను మూసివేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించే పోరాటాన్ని అడ్డుకోవడంపై వర్మ ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత గర్జన జరుపుతామంటూ ఆయన పేర్కొన్నారు. 



( పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే వర్మ)


 పోలీసుల కళ్లగప్పి నిరసనలో వర్మ 


టీడీపీ తలపెట్టిన దళిత గర్జన సభకు పోలీసులు ఎటువంటి అనుమతులు ఇవ్వనందున మాజీ ఎమ్మెల్యే వర్మను గృహనిర్బంధం చేశారు.  అయితే పోలీసుల కళ్లుగప్పి టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు తదితర నాయకులతో కలిసి పిఠాపురం చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజును అరెస్ట్ చేశారు. పిఠాపురంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 


అమలాపురంలో పరిస్థితి


కోనసీమ జిల్లా అమలాపురంలో అల్లర్లతో అప్రమత్తమైన పోలీసులు క్షేత్రస్థాయి పరిస్థితిపై దృష్టిపెట్టారు. మే 24న సంఘటన అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితి కుదుటపడినా ప్రత్యేక బలగాల మోహరింపు  పోలీసు పికెట్లు ఇంకా కొనసాగుతున్నాయి. అమలాపురం పట్టణంలోని గడియార స్తంభంతో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పేరూరు వై జంక్షన్‌, హైస్కూలు సెంటర్‌, ఈదరపల్లి, ఎర్ర, నల్ల వంతెన, బట్నవిల్లి ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అనుమానితులను తనిఖీ చేసి వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అమలాపురం అల్లర్లలో పాల్గొన్న వారిలో 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరు రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిపై మరింతగా  పోలీసులు దృష్టిసారించారు. పలు మండలాల్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ చేశారు.