Pavan No To BJP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు వచ్చినంత వరకూ భారతీయ జనతా  పార్టీతో దూరం పాటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన పరోక్షంగాతన మాటల ద్వారా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతల గురించి ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అంతే ఉన్నాయి. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మీడియా ప్రతినిధులతో  మాట్లాడినప్పుడు అసలు ఏపీ బీజేపీ నేతలతో తనకు పెద్దగా పరిచయాలు లేవు అనేశారు. దీంతో ఏపీ బీజేపీతో ఎలాంటి సంబంధాలను ఆయన కోరుకోవడం లేదని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.  


ఏపీ బీజేపీతో సంబంధాలు కోరుకోని జగన్ ?


ఏపీలో బీజేపీతో సంబంధాల విషయంలో పవన్ కల్యాణ్ మెల్లగా దూరం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. పొత్తుల పై తాను ఢిల్లీ  కేంద్రంగానే  చ‌ర్చిస్తున్నాన‌ని .. ఏపీ బీజేపీ నేతలతో అసలు పరిచయమే లేదని పేర్కొనడం కొత్త చర్చకు కారణం అవుతోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌తో రాజ‌కీయాల పై ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్ లో ఉంటూ చ‌ర్చిస్తున్న‌ట్లుగా ప‌వ‌న్ నేరుగా మాట్లాడారు. వాస్తవంగా అయితే ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశారు. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీతో కలిసి మరో ప్రధానమైన రాజకీయపక్షంగా రెండు పార్టీలు కలిసి ఎదిగే ప్రయత్నం  చేయాలి. కానీ ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో దూరం.. దూరం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 



ఏపీ బీజేపీ నేతలతో గ్యాప్ ఎందుకు ?


రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులో ఉంటూ... ఇక్కడి నేతలతో తనకు పరిచయాలు లేవని పవన్ అనడంపై గందరగోళం ఏర్పడింది.  ఇలాంటి మాట‌ల వెనుక ప‌వ‌న్ ఉద్దేశం ఎమై ఉంటుంద‌నేది ప్ర‌స్తుతం రెండు పార్టీల‌కు చెందిన నాయ‌కులకు అర్థం కాని ప్రశ్నగా మారింది.   దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు ఒకలా ఉంటే ఎపీ రాజ‌కీయాలు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి. అలాంటి ప‌రిస్దితుల్లో ప‌వ‌న్ రాజ‌కీయంగా వేస్తున్న అడుగులు ప్ర‌త్య‌ర్దుల‌కు ఈజీగా అర్దం అయిపోతున్నాయ‌నే అభిప్రాయం కూడా ఉంది. రాజ‌కీయం చేయ‌టం,ఎత్తుల‌కు పై ఎత్తులు వేసి,ప్ర‌త్య‌ర్దుల‌ను గంద‌ర‌గోళం చేసి చివ‌ర‌కు అనుకున్న ల‌క్ష్యం వైపు వెళ్లే ,వ్యూహం అనుస‌రించాల్సిన వేళ‌,ప‌వ‌న్ ఇలాంటి స్టేట్ మెంట్ లు ఇవ్వ‌టం కూడ ఇబ్బందిగానే ఉంటుంద‌ని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  


వ్యూహాత్మకంగా బీజేపీని దూరం పెడుతున్నారా ? 



వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదన్న లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్...  టీడీపీతో కలిసి  పోటీ చేసే యోచనలో ఉన్నారంటున్నారు. అందుకే  బీజేపీకి దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.   ఆత్మకూరులో బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఆయన సిద్ధగా లేరు. పోటీకి దూరమని ప్రకటించారు కానీ పోటీ చేస్తామంటున్న బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మరో వైపు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నడ్డా ను కలిసే చాన్స్ కూడా లేదని ఆయన ప్రకటించారు.  ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ ను దూరం పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు కలిసే నిర్వహించాలని అనుకుంటున్నప్పుడు జనసేనను పిలవాలి.. కానీ పిలవడం లేదు. గోదావరి గర్జన పేరుతో నిర్వహిస్తున్న సభకు కూడా పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానం అందలేదు. కనీస సమాచారం కూడా లేదు. నడ్డా ఏపీకి వస్తూ.. మేజర్ మిత్రపక్షమైన జనసేనకు సమాచారం ఇవ్వకపోవడంతో జనసేన అగ్రనేతలు కూడా నొచ్చుకున్నారు. తనకేమీ తెలియదని.. కలిసే అవకాశం కూడా లేదని.. పవన్ తెగేసి చెప్పారు. 
  


అన్నీ ఆలోచించే పవన్ దూరం !
 
రాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ తీరుపై పవన్ కల్యాణ్ అన్ని విశ్లేషించుకున్న తర్వాతనే ..  దూరంగా ఉండటం మంచిదన్న భావనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.  కేంద్ర అవసరాలో.. లేకపోతే.. మరో  రకమైన రాజకీయమో కానీ..  వైఎస్ఆర్‌సీపీతో ప్రస్తుతం ఏపీ బీజేపీని నడిపిస్తునన నేతలు సన్నిహితంగాఉంటున్నారని.. తాను బీజేపీ రాజకీయాల్లో ఇరుక్కుపోయానని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.  ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన బీజేపీకి దూరమైనట్లుగానే భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. ఢిల్లీ బీజేపీతో సఖ్యతగా ఉండి.. రాష్ట్రంలో మాత్రం సొంత రాజకీయాలు చేసుకునేందుకు పవన్ సిద్ధమైనట్లుగా అంచనా వేయవచ్చు.