Viral Video: ఉత్తరాఖండ్‌లో జాతీయ రహదారిపై భారీ కొండ చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. చమోలి జిల్లాలోని బద్రినాథ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా కొండ చరియలు పడిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ ఎత్తున కొండ చరియలు విరిగి నేరుగా రోడ్డుపైన వచ్చి పడ్డాయి. ఈ ధాటికి చాలా సేపటి వరకూ పరిసర ప్రాంతాల్లో దుమ్ము కమ్మేసింది.
కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి కొండ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో రహదారి పాక్షికంగా ధ్వంసమైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పలు రహదారులు ధ్వంసమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. నదులూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అలకనంద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జోషిమఠ్‌లోని విష్ణు ప్రయాగ్ నది కూడా ఇంతే ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చమోలి వద్ద రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడడం వల్ల బద్రినాథ్ హైవే బ్లాక్ అయింది. ఫలితంగా స్థానికులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు టూరిస్ట్‌లు కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం అనూకలించని కారణంగా ఛార్ ధామ్ యాత్రను ఓ రోజు పాటు నిలిపివేశారు. ఆ తరవాత ఆ ఆంక్షల్ని ఎత్తి వేశారు.