Land For Jobs Scam Case:


సోదాలు..


ఈడీ దూకుడు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఢిల్లీ, ముంబయి, పాట్నాలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ విచారణలో భాగంగా ఈ మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీలోనే 15 చోట్ల సోదాలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్ల ఇంట్లోనూ రెయిడ్స్ జరిగాయి. వీరితో పాటు ఆర్‌జేడీ మాజీ ఎమ్మెల్యే అబు దోజన ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. రెండ్రోజుల క్రితమే ఢిల్లీలో ఆయనను విచారించారు సీబీఐ అధికారులు. అటు ఈడీ కూడా వరుసగా సోదాలు చేపడుతూనే ఉంది. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. లాలూ హయాంలో  ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్‌పూర్, కోల్‌కత్తా, జైపూర్, హాజిపూర్‌లలో పలువురికి గ్రూప్‌ D పోస్ట్‌లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్‌షిప్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి.