Goa Forest Fire: గోవాలో అడవులు తగలబడుతున్నాయి. గోవాలోని మాదై వైల్డ్ లైఫ్ సాంక్చుయరీ(Mhadei Wildlife Sanctuary)లో ఇప్పటికే ఆరు రోజులుగా పచ్చటి అడవులు భారీ మంటలకు మాడి మసి అవుతున్నాయి. మూగజీవాల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. మంటలను ఆర్పేందుకు గోవా ప్రభుత్వానికి మద్దతుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ హెలికాఫ్టర్లను రంగంలోకి దింపింది కేంద్రం. దగ్గర్లోని రిజర్వాయర్లలోని నీటిని తోడుకుని మంటలను ఆర్పుతున్నా ఫలితం కనిపించటం లేదు. అటవీ ప్రాంత సమీపంలోని స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 


పడమటి కనుమల్లో జీవవైవిధ్యానికి కేంద్రాలుగా భావించే అడవులు గోవా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రపంచంలో బయోడెైవర్సిటీ హాట్ స్పాట్స్ ఎనిమిది ఉండగా... అందులో ఒకటి పశ్చిమ కనుమల్లోని ఈ అడవులు. కానీ గోవా చరిత్రలోనే ఇంతటి భారీ మంటలు అడవులను చుట్టుముట్టిన దాఖలాలు లేవు. కనీసం చేరుకునేందుకు వీలు లేని ప్రాంతాల్లో మంటలు అలముకోవటంపై ఎన్నో అనుమానాలున్నాయి. మార్చి 14నాటికి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తున్నాయి.


గోవా ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. అసలు మంటలు ఇంతలా గోవా అడవులను చుట్టుముట్టటానికి కారణాలు.. మొదట మంటలు కనిపించిన ప్రాంతాలను స్థానికుల సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే బాంబీ బకెట్లతో మంటలు విస్తరించకుండా నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయాసహకారాలు అందిస్తున్నాయని గోవా ప్రభుత్వం చెబుతోంది. గోవా అటవీశాఖామంత్రి విశ్వజిత్ రాణే మాత్రం ఈ మంటలకు కారణం మానవ తప్పిదమే అని అనుమానిస్తున్నామన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో భేటీ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ లో మంటలను ఆర్పుతున్న చర్యలను మంత్రి పరిశీలించారు. 






మరోవైపు ఈ మంటలపై రాజకీయ రంగు అలుముకుంది. గోవాకు వచ్చే విదేశీ పర్యాటకులను అడ్డుకోవటమే లక్ష్యంగా మంత్రి వ్యాఖ్యలున్నాయని... మంటలకు మానవతప్పిదమే కారణం అని మంత్రి చెప్పటం దేనికి సంకేతం అని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు మనుషులు వెళ్లటానికే వీలులేని ప్రాంతాల్లో అడవులను తగులబెట్టాలని ఎవరు కోరుకుంటారని విపక్షాలు మండిపడుతున్నాయి.