ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు ఇదివరకే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 26న లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. 2021 -22 డిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అవకతవకలు జరిగాయని సీబీఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్విస్ట్ జరిగింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఈడీ అధికారులు సీబీఐ కస్టడీ నుంచి సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు.


తీహార్ జైళ్లో ఉన్న మాజీ మంత్రి సిసోడియాను ప్రత్యేక కోర్టు అనుమతితో మార్చి 7 నుంచి మూడు రోజులపాటు ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తయిన తరువాత సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే మొదట ఈ కేసులో నవంబర్ 25, 2022న సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన సమయంలో సిసోడియా పేరు సైతం ఇందులో లేదని ఆప్ నేతలు ప్రస్తావిస్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆప్ నేతలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వినియోగిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం నిప్పులు చెరిగారు. 






సిసోడియాను వదిలిపెట్టే ప్రసక్తే కనిపించడం లేదు...
సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ప్రత్యేక కోర్టు అనుమతితో ఈడీ అధికారులు మూడు రోజులపాటు సిసోడియాను ప్రశ్నించారు. గురువారం విచారణ పూర్తయ్యాక సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. సిసోడియా బెయిల్ పిటిషన్ ను మార్చి 10న విచారించనున్నారు. సరిగ్గా ఒకరోజు ముందు ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ముందు సీబీఐ, ఇప్పుడు ఈడీ అధికారులు సిసోడియాను లక్ష్యంగా చేసుకుని వ్యవరిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. జరుగుతున్నది గమనిస్తే.. ఏం జరిగినా సరే సిసోడియాను మాత్రం జైళ్లో ఉంచాలి అనేది వారి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు కేజ్రీవాల్.


ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి కస్టడీలో సిసోడియాతో పాటు అతని మాజీ కార్యదర్శి సి అరవింద్,  మాజీ ఎక్సైజ్ కమిషనర్ గోపీ కృష్ణలను అధికారులు పలు విషయాలపై ప్రశ్నించారు. అయితే సీఎం కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితి గమనించి ఇద్దరు ఢిల్లీ మంత్రులను పదవుల నుంచి తొలగించి కొత్తవారిని నియమించారు. ఈ నెల 7వ తేదీన సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. ఇద్దరు కీలక ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశారు కేజ్రీవాల్. కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిషి..సిసోడియాకు రైట్‌ హ్యాండ్‌లా ఉండేవారు. ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌కు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇప్పటికే వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. అతిషికి విద్యాశాఖను కేటాయించారు. సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్య శాఖ అప్పగించారు.