Delhi New Ministers:


పొలిటికల్ హీట్..


లిక్కర్ స్కామ్ కేసుతో ఢిల్లీ రాజకీయాలు మారిపోతున్నాయి. డిప్యుటీ సీఎం పదవిలో ఉన్న మనీశ్ సిసోడియా రాజీనామా చేశాక ఆ హీట్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్‌లో ఉన్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ కూడా ఓ కేసులో జైలుకు వెళ్లారు. దాదాపు 10 నెలలుగా ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులూ ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వాళ్ల స్థానంలో ఇద్దరు సీనియర్ నేతలను నియమించింది ఆప్ అధిష్ఠానం. ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌కు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇప్పటికే వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. అతిషికి విద్యాశాఖను కేటాయించారు. సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్య శాఖ అప్పగించారు. ఈ నెల 7వ తేదీన సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ తరవాతే ఇద్దరు కీలక ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశారు కేజ్రీవాల్. కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిషి..సిసోడియాకు రైట్‌ హ్యాండ్‌లా ఉండేవారు. ఈస్ట్ ఢిల్లీ నియోజవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. గౌతమ్ గంభీర్‌పై పోటీ చేసి ఓడి పోయారు. ఇక సౌరభ్ భరద్వాజ్ ఆప్ జాతీయ ప్రతినిధిగా రాణించారు. ఢిల్లీ జల్‌బోర్డ్‌ వైస్ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.