Lancet Study: 


రెసిస్టెన్స్ కోల్పోయే ప్రమాదం..


కాస్తంత జలుబో, జ్వరమో రాగానే వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. మామూలువి కూడా కాదు. ఏకంగా యాంటీ బయాటిక్స్‌ను వాడేస్తున్నాం. వాటి వల్ల వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్ ఏంటని ఆలోచించకుండా మితిమీరి వాడుతున్నారంతా. ఇప్పుడిదే విషయాన్ని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. కొవిడ్‌ తరవాత మందుల వినియోగం బాగా పెరిగింది. వీటిలో ఎక్కువగా యాంటీ బయాటిక్స్ (Anti Biotics) ఉంటున్నాయని లాన్సెట్ 
రిపోర్ట్ తేల్చి చెప్పింది. మరో కీలకమైన అంశం ఏంటంటే..భారత్‌లోనే యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా అజిథ్రోమైసిన్‌ (Azithromycin) వాడకం బాగా పెరిగిందని తెలిపింది. కొన్ని యాంటీబయాటిక్స్‌ను సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవల్ కూడా లేదని స్పష్టం చేసింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి...విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది లాన్సెట్ రిపోర్ట్. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. అప్రూవల్ లేని, నాసిరకమైన యాంటీబయాటిక్స్‌ను 
విపరీతంగా వినియోగించటం చాలా ప్రమాదకరమని, భారతీయులు క్రమంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ కోల్పోతారని హెచ్చరించింది. కేంద్రం, రాష్ట్రాల వారీగా చూసుకుంటే డ్రగ్ రెగ్యులేటరీ అధికారాలు చాలా భిన్నంగా ఉంటున్నాయని తెలిపింది. విక్రయాలు, వినియోగంలో గందరగోళానికి ఇది కారణమవుతోందని వెల్లడించింది లాన్సెట్. 


అజిథ్రోమైసిన్‌ వినియోగమే అధికం..


"తలసరి వినియోగంలో చూసుకుంటే మిగతా దేశాల కన్నా భారత్‌లో యాంటీబయాటిక్స్ వినియోగం తక్కువగానే ఉంది. కానీ...మొత్తంగా చూసుకుంటే అన్ని దేశాల్లో కన్నా యాంటీబయాటిక్స్ విక్రయాలు, వినియోగం భారత్‌లో అధికంగానే ఉంటోంది. ఈ వాడకాన్ని కాస్త తగ్గించుకోవటమే మంచిది" అని లాన్సెట్ తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌కు చెందిన ఆశ్నా మెహతా ఈ లెక్కలు సేకరించేందుకు సహకరించినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 9,000 మంది సేల్స్ రిప్రజంటేటివ్స్‌ నుంచి వివరాలు సేకరించటంతో పాటు ఫార్మాట్రాక్ (PharmaTrac)కంపెనీ ఇచ్చిన వివరాలనూ పరిశీలించింది. ఆ తరవాతే నివేదిక వెలువరించింది.  Defined Daily Dose (DDD) ఆధారంగా...యాంటీబయాటిక్స్ వినియోగం ఎలా ఉందన్నది లెక్కించింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే..2019లో భారత్‌లో Defined Daily Dose 5,071 మిలియన్లుగా నమోదైంది. అంటే..ప్రతి వెయ్యి మందికి 10.4 DDDగా నమోదైంది. అజిథ్రోమైసిన్‌ యాంటీ బయాటిక్ మాలిక్యూల్ వినియోగం అధికంగా ఉంటోంది. Azithromycin 500mg ట్యాబ్లెట్ 384 మిలియన్న డోసులుగా ఉంటుండగా..Cefixime 200 mg ట్యాబ్లెట్‌ వినియోగం 331 million డోసులుగా తేలింది.