లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా శనివారం ఉదయం 11 గంటలకు పోలీసుల ముందు హాజరవుతారని సాల్వే కోర్టుకు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. అయితే ఆయనను ఈ రోజు 10 గంటలకు తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆశిష్.. హాజరుకాకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశిష్‌పై ఉన్న అభియోగాలు చాలా తీవ్రమైనవని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.
ఈ సందర్భంగా తుపాకీ తూటా గాయాలైనట్లు ఆరోపణలు వస్తే.. నిందితులకు ఇలాగే నోటీసులు పంపిస్తారా? అని సుప్రీం ప్రశ్నించింది. అయితే పోస్టుమార్టం నివేదికలో ఎవరికీ తుటాల గాయాలు కాలేదని తేలినట్లు కోర్టుకు తెలిపారు సాల్వే. అందుకే అతనికి నోటీసులు పంపించామని చెప్పారు.
ఆశిష్ పరారీ..
ఆశిష్ మిశ్రాను ప్రశ్నించేందుకు ఈ కేసు దర్యాప్తు చేపడుతున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉపేంద్ర అగర్వాల్ ఇప్పటికే లఖింపుర్ చేరుకుని వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆశిష్ నేపాల్ పారిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
పరారీలో ఉన్నది నిజమే అయితే.. కేంద్రం కలుగజేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి నేపాల్ నుంచి రప్పించాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read: IAF Foundation Day: విదేశీ శక్తులను భారత గడ్డపై అడుగుపెట్టనివ్వం: వాయుసేన అధిపతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి